అయప్ప దర్శనం చేసుకున్న మహిళలు

తిరువనంతపురం, జనవరి 2: శబరిమల అయ్యప్పను 50 ఏళ్ళలోపు మహిళలు ఇద్దరు దర్శనం చేసుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తదనంతరం 50 ఏళ్ళ లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే ప్రధమం. కేరళ జిల్లాలోని కోళికోడ్ జిల్లాకు చెందిన బిందు (42), కనకదుర్గ (44) బుధవారం తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం అయ్యప్పను దర్శించుకునేందుకు బయలుదేరిన వీరు అర్ధరాత్రి 12 గంటలకు పంబ చేరుకున్నారు. అక్కడనుంచి పోలీసు భద్రత లేకుండానే సన్నిధానానికి వచ్చారు. అనంతరం 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు.
ఈ సమయంలో పంబ నుంచి ఆలయం వరకు భక్తు‌లు ఉన్నప్పటికీ వీరిని అడ్డుకోలేదు. నల్లని డ్రస్‌లో వడివడిగా ఆలయానికి చేరుకున్నవీరిద్దరూ 3.40కు ఆలయంలోకి ప్రవేశించి, మెట్ల ద్వారా స్వామిని దర్శించుకుని తిరిగివచ్చారు. శబరిమల ఆలయంలోకి బహిష్టు వయసు మహిళల ప్రవేశంపై నిషేధం అమలులో వుంది.
సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబరు 28న ఈ నిషేధాన్ని రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పు పైన కేరళలో నిరసన వ్యక్తం చేశారు. తీర్పు తర్వాత మహిళలు పోలీసుల భద్రత నడుమ ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు.
తొలి ప్రయత్నంగా కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు అయప్ప దర్శనం కోసం గత ఏడాది డిసెంబరు 18న పోలీసుల సహాయంతో సన్నిధానం సమీపంలోని మరకూటం చేరుకోగా భక్తులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సివచ్చింది.
తాజాగా జరిగిన మహిళల దర్శనాన్ని ధ‌ృవీకరించలేదు. అయప్ప దర్శ సేవ నేత రాహుల్ ఈశ్వర్ మహిళలు రహస్యంగా దర్శనం చేసుకోవడాన్నీ ఖండించారు. హరి ప్రభాకరన్ అనే వ్యక్తి మహిళలు పోలీసుల సహకారంతో వెనుక గేటునుంచి దర్శనం చేసుకున్నారనీ, 18 మెట్లు ఎక్కలేదనీ అన్నారు. ఈ వివాదంపై పలురకాల భిన్న కధనాలు వెలువడుతున్నాయి. మహిళల దర్శనానికి సంబంధించి విడుదల అయిన వీడియో వైరల్‌గా మారింది.