భోపాల్: జంతువులకు కొమ్ములు ఉంటాయి. కానీ మనిషికి కొమ్ములు ఉండటం ఎప్పుడైన విన్నారా? మనుషులకు కొమ్ములెట్లా మొలుస్తాయి అనే అనుమానం రావచ్చు. కానీ ఓ వ్యక్తికి ఖడ్గ మృగానికి ఉన్నట్లుగా అతని తలపై కొమ్ము మొలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
సాగర్ జిల్లాలోని రాహి గ్రామానికి చెందిన శ్యామ్లాల్ యాదవ్ అనే 74 ఏళ్ల వృద్దుడు అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం శ్యామ్లాల్ తలపై గాయమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు దాని స్థానంలో కొమ్ము లాంటి ఆకారం ఏర్పడింది. మొదట్లో దాన్ని శ్యామ్లాల్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది అలా పైకి పెరుగుతుండేసరికి అందరూ అతన్ని వింతగా చూసేవారు. దీంతో ఆ కొమ్ముని శ్యామ్లాల్ ఇంట్లో ఉన్న కత్తెరతో కత్తిరించాడు. అయితే, శ్యామ్లాల్ కట్ చేసేకొద్దీ అది పెరుగుతునే ఉండేది. దీంతో శ్యామ్ లాల్ వైద్యులను సంప్రదించాడు. శ్యామ్ లాల్ తలపై కొమ్మును చూసిన డాక్టర్ల ముందు ఆశ్చర్యపోయారు. తరువాత పరీక్షలు చేసి.. దీనిని డెవిల్ హార్న్ సమస్యగా గుర్తించారు. అనంతరం సాగర్ భాగ్యోదయ్ ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేసి ఆ కొమ్ములాంటి ఆకారాన్ని తొలగించారు. దీంతో శ్యామ్లాల్కు ఉపశమనం లభించింది.
శ్యామ్లాల్కు వచ్చిన సమస్యను డెవిల్ హార్న్ అంటారని.. వైద్య పరిభాషలో సెబాసియస్ హార్న్ అంటారని వైద్యులు తెలిపారు. ఎండ వేడి తగిలే ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా శ్యామ్లాల్కు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు విశాల్ గజ్భీయే మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన ఆపరేషన్ అని తెలిపారు. ఎక్స్ రేలో దాని మూలాలు లోతుగా లేవని గుర్తించామని, అందుకే సర్జరీ చేశామన్నారు. మరోసారి అలాంటి హార్న్ రాకుండా సర్జరీ చేసి దాన్ని పూర్తిగా తొలగించామని చెప్పారు. ఈ కేసు అరుదైనది కాబట్టి దీని వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ సైన్స్ లో ప్రచురణార్థం పంపిస్తామని వెల్లడించారు.