గ్రేటా తున్బెర్గ్ యూరప్ నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయాణించిన బోటు
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అటు ఆసియాలో ఇటు ఆఫ్రికాలో, అటు ఉత్తర అమెరికాలో ఇటు దక్షిణ అమెరికాలో, పైన ఆర్కిటిక్ దేశాల్లో కింద ఆస్ట్రలేషియాలో, మధ్యనున్న యూరప్ దేశాల్లో, అన్ని టైమ్ జోనుల్లో, అన్ని మూలలా, అంతటా శుక్రవారం నాడు ఒకటే నినాదం. మాకు మంచి వాతావరణం కావాలి. మేము పీల్చే గాలి పరిశుభ్రమైనదై ఉండాలి. మేము తాగే నీరు స్వచ్ఛమైనదై ఉండాలి. కాలుష్య కాసారమైన భూగ్రహాన్ని భవిష్య తరాలకు అందించే హక్కు మనకు లేదు. ఎక్కడ చూసినా ఇదే ప్రదర్శన, ఇదే నినాదం.
భూతాపం సమస్యను తక్షణం పట్టించుకుని పరిష్కారాలు వెదకాలని ప్రపంచ దేశాల నాయకులను కోరుతూ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచ చరిత్రలోనే ఇప్పటివరకూ చూడని ఈ అతి పెద్ద వాతావరణ మార్పు నిరసనకు స్ఫూర్తి ఓ 16 ఏళ్ల అమ్మాయి.
గత సంవత్సరం ఆగస్టులో ఒక రోజు గ్రేటా తున్బెర్గ్ అనే టీనేజి అమ్మాయి స్కూలు మానేసి భూతాపం తగ్గించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వీడన్ పార్లమెంట్ ముందు ప్లకార్డు పట్టుకుని నుంచుంది. ఆనాటి నుంచి మంచి వాతావరణం కోసం స్కూలు సమ్మె ఉద్యమాలు మొదలయ్యాయి. ప్రపంచంలో ఏదో ఒక మూల వరసగా జరుగుతూనే ఉన్నాయి.
తాను చూపించిన మార్గంలో మరికొంత మంది నడవడం మొదలుపెట్టడమే తున్బెర్గ్కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. 2018లో తున్బెర్గ్ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించింది. అమెరికా కాంగ్రెస్ ఆ అమ్మాయిని ఆహ్వానించి తన ప్రసంగాన్ని విన్నది. ఈ సంవత్సరం మే నెలలో టైమ్ మ్యాగజైన్ తున్బెర్గ్ ఫొటోను కవర్ పేజిపై ముద్రించి ఆమెపై కథనాన్ని ప్రచురించింది. తున్బెర్గ్ను ఆ పత్రిక రేపటి తరం నాయకురాలిగా అభివర్ణించింది.
తున్బెర్గ్ శాకాహారి. మాంసాహారం తయారి వల్ల వాతావరణలోకి కర్బన వాయువులు ఎక్కువగా విడుదల అవుతాయి కాబట్టి తన తల్లిదండ్రులతో కూడా ఆ అమ్మాయి మాంసాహారం మాన్పించింది. తున్బెర్గ్ విమానాలలో ప్రయాణించదు. మొన్న అమెరికా వెళ్లడానికి ఆమె ఒక రేసింగ్ బోటులో 15 రోజుల పాటు ప్రయాణించింది. ఆ బోటు సౌరశక్తితో, అండర్వాటర్ టర్బైన్లతో నడుస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి తున్బెర్గ్ ఎంత శ్రమ తీసుకుంటుందో, ఇతరులకు ఎలా అదర్శంగా నిలుస్తుందో దీని వల్ల అర్ధం అవుతుంది.
మూడు రోజుల క్రితం తున్బెర్గ్ అమెరికా కాంగ్రెస్ ముందు మాట్లాడింది. భూతాపం సిద్ధాతం ఉత్తి కల్పితం అని వాదించే రిపబ్లికన్ పార్టీ సభ్యుడు గారెట్ గ్రేవ్స్ సంధించిన ప్రశ్నకు ఏమాత్రం తత్తరపడక ఆ 16 ఏళ్ల అమ్మాయి జవాబిచ్చిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తున్బెర్గ్ ప్రపంచ దేశాల నాయకులకు ఒకటే సందేశం ఇస్తుంది: “భూమి వాతావరణం ఉష్ణోగ్రత ఇలాగే పెరుగుతూ పోతే సర్వనాశనం తప్పదని సైన్స్ చెబుతోంది. నామాటో మరొకరి మాటో వినక్కర లేదు. సైన్స్ చెప్పే మాట వినండి”.
గ్రేటా తున్బెర్గ్ సందేశం వీడియో, ఆ తర్వాత దాని కింద రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు గారెట్ గ్రేవ్స్ ప్రశ్నకు తడబడకుండా తున్బెర్గ్ ఇచ్చిన సమాధానం వీడియో చూడండి
And here's Greta Thunberg subtly refuting @RepGarretGraves's self-defeating logic that the US doesn't need to do more to address the climate crisis because other countries are lagging behind pic.twitter.com/4WH9iirSXN
— Aaron Rupar (@atrupar) September 18, 2019