కేజ్రీకి కొత్త తలనొప్పులు!

ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయా? 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్ కు కోర్టు శిక్ష విధించిన అనంతరం ఆప్  అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం ఏమిటంటే మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి ఇచ్చిన భారత రత్న పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలన్నదే.

అయితే ఈ తీర్మానాన్ని ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా తీవ్రంగా వ్యతిరేకించి వాకౌట్ చేశారు. దీనిపై పార్టీ నిర్ణయంతో విభేదించిన ఆమె రాజీనామా చేయాలని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సూచించడంతో ఆమె రెడీ అన్నారు. దీంతో కంగుతిన్న ఆప్ రాజీవ్ కు భారత రత్నను వెనక్కు తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ కోరలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా విచారణ వేగవంతం చేయాలన్నదే తమ తీర్మానం సారాంశమని పేర్కొన్నారు. రాజీవ్ అంశాన్నితీర్మానం అనడం సరికాదని వివరణ ఇచ్చుకుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. పార్టీ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటులో ఆప్ భాగస్వామ్యంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఏది ఏమైనా అనవసర విషయం, అనవసర తీర్మానంతో ఆప్ కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకుందని చెప్పవచ్చు.