ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం మధ్యాహ్నం ముంబై- పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై కోల్హాపూర్ సమీపంలో షబానా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త జావేద్ అక్తర్ కూడా కారులోనే ఉన్నారు. ఆయనకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. వారికి ముంబైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
బాలీవుడ్లో ఆర్ట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి షబానా అజ్మీ. అంతేకాదు ఇప్పటి వరకు ఆమె ఉత్తమ నటిగా ఐదు జాతీయ చలన చిత్ర పురస్కారాలను అందుకొని రికార్డు సృష్టించారు. ఆమె భర్త జావేద్ అక్తర్ ప్రముఖ బాలీవుడ్ రచయత. అప్పట్లో ఆయన ‘షోలే’, ‘జంజీర్’ వంటి సినిమాలకు సలీమ్ ఖాన్‌తో కలిసి రచనలు చేశారు.