మొట్టమొదటి అపాచీ హెలికాప్టర్
బోయింగ్ ప్లాంటులో అందజేత
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి అదనపు బలం సమకూరింది. మొట్టమొదటి అపాచీ గార్డియన్ ఎటాక్ హెలికాప్టర్ మన చేతికి అందింది. అరిజోనాలోని బోయింగ్ ఉత్పాదక కేంద్రంలో భారత వైమానిక దళానికి అధికారికంగా దాన్ని అందజేశారు. ఈ విషయాన్ని భారత వైమానికదళం ట్వీట్ చేసింది. ఏహెచ్-64ఈ అపాచీ గార్డియన్ హెలికాప్టర్లు ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించి గాలిలోను, నేల మీద ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. కొండ ప్రాంతాలలోను, చెట్లు దట్టంగా ఉన్నా కూడా ఇవి నిరాటంకంగా ప్రయాణించగలవు.
#ApacheInduction: First AH-64E (I) Apache Guardian helicopter was formally handed over to the IAF at Boeing production facility in Mesa, Arizona, USA on 10 May 19. Air Mshl AS Butola, represented the IAF & accepted the first Apache in a ceremony at Boeing production facility. pic.twitter.com/FzA0IfRine
— Indian Air Force (@IAF_MCC) May 11, 2019
ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలా భారత వైమానిక దళం తరఫున వెళ్లి మొట్టమొదటి అపాచీ హెలికాప్టర్ ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మన వైమానిక దళం కోసం మొత్తం 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి 2015 సెప్టెంబరులో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థలతో వైమానిక దళం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంవత్సరం జులై నాటికి మొదటి బ్యాచ్ చాపర్లను పంపాల్సి ఉంది. దీనికి సంబంధించి అలబామాలోని అమెరికా ఆర్మీ కేంద్రంలో మన వైమానిక సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది కూడా శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ పొందిన సిబ్బందే వైమానిక దళంలో అపాచీ చాపర్లను నడిపిస్తారు.
వైమానిక దళంలోని చాపర్ల బలగంలో ఏహెచ్-64ఈ హెలికాప్టర్లు రావడం గణనీయమైన ముందడుగని వైమానిక దళం చెబుతోంది. మన వైమానిక దళ భావి అవసరాలకు తగినట్లుగా హెలికాప్టర్ డిజైనులో కూడా మార్పుచేర్పులు చేశారు. ప్రధానంగా పర్వతప్రాంతాలు, దట్టమైన అడవుల్లో దాడులకు వీటిని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒకవైపు భూమార్గం నుంచి ముప్పు ఉండి, గగనతలంలో కూడా ప్రమాదం ఉన్న పరిస్థితులను అపాచీ హెలికాప్టర్లు సమర్ధంగా అడ్డుకోగలవు. యుద్ధరంగానికి సంబంధించిన ఫొటోలను వీటి నుంచి పంపచ్చు, వీటిలోని సిబ్బందికి కూడా పంపచ్చు. భవిష్యత్తులో కాల్బలానికి మద్దతు ఇవ్వాల్సి వచ్చినపుడు వైమానిక దళానికి ఇవి బాగా అక్కరకొస్తాయని వైమానిక దళం తన ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది. ఇప్పటికే రవాణా అవసరాల కోసం బోయింగ్ నుంచి భారతదేశం చినూక్ హెలికాప్టర్లు కొంది. ఇవి బలగాలను, ఆయుధాలను, పరికరాలను, ఇంధనాన్ని కూడా భారీ మొత్తంలో తీసుకెళ్లగలవు.