కాస్త కప్పుకొని రామ్మా..!

  • విమానం ఎక్కబోయిన మహిళకు అవమానం
  • దుస్తుల తీరుపై విమాన సిబ్బంది అభ్యంతరం
  • మార్చుకోకపోతే దించేస్తామంటూ హెచ్చరికలు
  • దారుణమైన అనుభవమని వాపోయిన మహిళ

బ‌ర్మింగ్‌హామ్‌: తనకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించి విమానంలో వెళ్లాలనుకున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఒంటినిండా కప్పుకొని వస్తేనే ప్రయాణం చేయనిస్తామని, లేదంటే దింపేస్తామని విమాన సిబ్బంది హెచ్చరించారు. ఈ విషయం కాస్తా తర్వాత రచ్చరచ్చ కావడంతో థామస్ కుక్ విమానయాన సంస్థ ఆమెకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. బ‌ర్మింగ్‌హామ్‌ నుంచి కానరీ ఐలండ్స్ వరకు వెళ్లాలనుకున్న ఎమిలీ ఓ’కానర్ తనకెదురైన ఈ అనుభవం గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఏం వేసుకున్నారని…
స్పాగెట్టీ స్ట్రాప్స్ ఉన్న క్రాప్డ్ టాప్, నడుం పైవరకు ఉండే ప్యాంటు వేసుకుని ఆమె విమానంలోకి ఎక్కారు. అయితే ఆమె పొట్ట బయటకు కనిపిస్తోందని, అది సరికాదన్నది విమాన సిబ్బంది వాదన. విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ఆమెకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ విమానం ఎక్కగానే నలుగురు సిబ్బంది చుట్టుముట్టారు. దుస్తులు మార్చుకోవాలని, లేకపోతే దింపేస్తామని బెదిరించారు. ఇది తన జీవితంలోనే అత్యంత హేయమైన, దారుణమైన, వివక్షతో కూడిన అనుభవమని ‘ద సన్’ పత్రికకు ఆమె తెలిపారు. తనకు రెండు వరుసల వెనక సీటులో ఉన్న వ్యక్తి షార్ట్స్, వెస్ట్ టాప్ వేసుకున్నా అతడిని ఏమీ అనలేదని చెప్పారు.

ఎవరికీ లేని ఇబ్బంది..
తన దుస్తుల వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా అని తోటి ప్రయాణికులను ఎమిలీ అడిగారు. దానికి ఏ ఒక్కరూ అవునని చెప్పలేదు. కానీ విమాన సిబ్బందిలో ఒకరు మాత్రం పరిస్థితి గురించి ఏకంగా స్పీకరులో ప్రకటన చేశారు. దాంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇంతలో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు అత్యంత అవమానకరంగా మాట్లాడాడు. ‘నోర్మూసుకుని ఏదో ఓ దరిద్రపు జాకెట్ వేసుకో’ అని అరిచాడు. దానికి సిబ్బంది ఏమీ స్పందించలేదు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఎమిలీ బంధువు ఒక జాకెట్ తీసి ఇచ్చారు. కానీ సిబ్బంది మాత్రం ఆమె దాన్ని ధరించేవరకు అక్కడినుంచి కదల్లేదు.

వ్యక్తిగత క్షమాపణ
జరిగిన విషయం మొత్తాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా బయటపెట్టడం, ‘ద సన్’ పత్రికకు కూడా తెలియజేయడంతో పెను వివాదం రేగింది. థామస్ కుక్ కేబిన్ సర్వీసస్ డైరెక్టర్ స్వయంగా ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారు. జరిగిన ఘటనపై విచారించిన తర్వాత విమానయాన సంస్థ తరఫున కూడా మరోసారి ఎమిలీకి క్షమాపణలు చెప్పారు. దుస్తుల విషయంలో తమకు ఓ విధానం ఉందని తెలిపారు. అది అన్ని వయసుల పురుషులు, మహిళలకు వర్తిస్తుందన్నారు. దాన్ని అమలు చేయడం తమ సిబ్బందికి కష్టం అవుతోందని అన్నారు. ఆ విధానం అన్నిసార్లూ సరికాకపోవడమే అందుకు కారణమని చెప్పారు.