టిడిపికి ఆలీ షాక్ : వైసిపిలో చేరిక

 

హైదరాబాదు, మార్చి 11: ప్రముఖ హాస్య నటుడు ఆలీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. సోమవారం ఉదయం లోటస్ పాండ్‌లో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

విజయవాడలో ఫిబ్రవరి 18న ఆలీ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సంగమం సంస్థ ఆయన ఘన సత్కారం ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలీని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో ఆలీ టిడిపిలో చేరనున్నారని భావించారు. ఆలీకి గుంటూరు నుండి అసెంబ్లీ సీటు ఖరారు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత చూపినట్లు సమాచారం.

అంతకు ముందు ఆలీ ఒకే రోజు జనసేనాని పవన్ కల్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబులను కలిసి వెళ్లారు. దీంతో ఆలీ ఏ పార్టీలో చేరతారు అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఒక ఎలక్ర్టానిక్ మిడియా ఇంటర్వ్యూలో ఆలీ స్పష్టంగా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వంతో పాటు హోదా (మంత్రి పదవి) హామీ ఇచ్చే పార్టీలో చేరనున్నట్లు నర్మగర్భంగా తెలియజేశారు. అదే ఇంటర్వ్యూలో వైసిపి ముఖ్య నాయకులు తనను ఆహ్వానిస్తున్నారు గానీ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నుండి తనకు ఆహ్వానం రాలేదని కూడా చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఆలీకి స్వయంగా జగన్మోహనరెడ్డి నుండి ఆహ్వానం అందడంతో సోమవారం ఉదయం లోటస్ పాండ్‌కు చేరుకున్నారు. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు.

1999లో ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ ద్వారా ఆలీ తెలుగుదేశం పార్టీలో చేరారు. నాడు ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో  టిడిపి తరపున ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలి మిడియాతో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పాదయాత్ర తరువాత చాలా ఇంపాక్ట్ వచ్చిందని అలీ అన్నారు. తాను ఎక్కడ నుండి పోటీ చేయడం లేదనీ, పార్టీ తరపున ప్రచారం చేస్తానని ఆలీ తెలిపారు.