హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఎదురీత!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నప్పటికీ హుజూర్‌నగర్ ఉపఎన్నిక రంగంలో అధికారపక్షం టిఆర్ఎస్‌కు వాతావరణం అంత అనుకూలంగా కనబడడం లేదు. ముందు కొద్దిగా అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అంతా మారిపోయింది. నిజానికి దసరా పండగ సమయంలో సమ్మెకారులపై ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. సమ్మె పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ అవలంబించిన కఠిన వైఖరి దానిని తారుమారు చేసింది. హుజూర్‌నగర్‌లో గురువారం తలపెట్టిన సభకు కెసిఆర్ వస్తారా రారా అన్నది మధ్యాహ్నం వరకూ ఖరారు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. తీవ్రమైన తర్జనభర్జనల తర్వాత  చివరకు ముఖ్యమంత్రి తన పర్యటన రద్దు చేసుకున్నారు.

ఈ సమ్మె కారణంగానే ముఖ్యమంత్రి తనయుడు కెటిఆర్, ఇతర టిఆర్ఎస్  ముఖ్యులు హుజూర్‌నగర్‌కు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల వల్ల నియోజకవర్గంలో అధికారపక్షం కార్యకర్తలు బాగా డీలా పడ్డారు. వారిలో ఉత్సాహం నింపి ముందుకు నడిపించే నాయకుడు లేకపోయాడు. మొన్నటి ఎన్నికలలో నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన కారణంగా అప్పుడు ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి జి. జగదీశ్వర రెడ్డిని ఈసారి తప్పించి పల్లా రాజేశ్వరరెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించారు. దానితో జగదీశ్వరరెడ్డి అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మామ నుంచి ఆదేశం లేక ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఇంతవరకూ హుజూర్‌నగర్ ముఖం చూడలేదు.

విజయం ఖరారు చేసుకోవడం కోసం డబ్బు ఎంతైనా గుప్పించేందుకు ఆధికారపక్షం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ నిరంతర నిఘా కారణంగా వారికి కాలూచేయీ ఆడడం లేదు. ఎన్నికల ఖర్చు పరిశీలకుడిగా వచ్చిన బాలకృష్ణన్ అనే ఐఆర్ఎస్ అధికారి చెమటలు పట్టిస్తున్నారు. బిజెపి నాయకుల ప్రోద్బలంతోనే ఎన్నికల కమిషన్ బాలకృష్ణన్‌ను హుజార్‌నగర్ పంపించిందని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు.

డబ్బు నేరుగా ఖర్చు చేయలేక టిఆర్ఎస్ నాయకులు  రకరకాల తిప్పలు పడుతున్నారు. మొన్న నేరేడుచెర్లలో ఒక కుటుంబం షష్టిపూర్తి వేడుక చేసుకుంటున్నట్లు తెలిసి టిఆర్ఎస్ నాయకులు వెంటనే వారిని సంప్రదించారు. దగ్గర బంధువులను మాత్రమే పిలవాలనుకున్న ఆ కుటుంబానికి ఖర్చు మొత్తం తామే భరిస్తామని నచ్చజెప్పి, చాలామందికి ఆహ్వానం పంపించారు. అక్కడ తమ ప్రచారం, ఇతర పంపిణీ కార్యక్రమాలను గుట్టుచప్పుడు కాకుండా చేసుకున్నారు.

మరోపక్క ముందు మద్దతు ఇస్తామన్న సిపిఐ తర్వాత ప్రజలలో వచ్చిన వ్యతిరేకత చూసి వెనక్కు తగ్గడం  అధికారపక్షానికి షాక్‌లాగా పరిణమించింది. ప్రజాసంఘాలలో వెల్లువెత్తిన వ్యతిరేకత చూసి సిపిఐ జంకింది. ముందు అసలు మద్దతు  ప్రకటించకపోయినా బాగానే ఉండేదనీ, ఇప్పుడు మద్దతు నిర్ణయం ఉపసంహరణ వల్ల చాలా నష్టం జరిగిందనీ టిఆర్ఎస్ భావిస్తున్నది.

హుజూర్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. 2009 నుంచీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాటి మంచిచెడ్డలు బాగా తెలుసు. ఆ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఉత్తమ్‌ మాట కాదనే పరిస్థితి లేదు. వాటిలో ఒకదానికి మైహోం రామేశ్వరరావు  యజమాని. ముఖ్యమంత్రికి ఎంతో సన్నిహితుడైన రామేశ్వరరావు కూడా కాంగ్రెస్ అభ్యర్ధి అయిన ఉత్తమ్‌ సతీమణికి వ్యతిరేకంగా పని చేసే అవకాశం లేదు.

మొదట్లో ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కూడా రంగంలోకి దింపుతున్నారు. కాంగ్రెస్‌లో ముఠాలు లేవు, అందరూ కూడా అభ్యర్ధి పద్మావతి విజయం కోసమే పనిచేస్తున్నారన్న సందేశం జనంలోకి పంపాలన్న ఉద్దేశంతో రెండు రోజుల పాటు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు.