పెద్దమనసు “పేట్రియాట్”!

దాదాపు రెండు తరాల అభ్యుదయవాదుల కళ్ళు తెరిపించిన సి.రాఘవాచారి అక్టోబర్ 28  ఉదయం ఏడింటికి కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో మూడునాలుగేళ్లుగా అవస్థ పడుతున్నారు; రెండు మూడు వారాలుగా ఆస్పత్రిపాలైన రాఘవాచారి సోమవారం పొద్దుట కన్నుమూశారు.
గొప్ప జర్నలిస్టుగా రాఘవాచారి ప్రతిభా పాటవాలకు -ఆయన మిత్రులు మాత్రమే కాదు, తద్భిన్నమయిన వారు సైతం- జోహారులర్పించడం కద్దు. “పేట్రియాట్”, “లింక్” తదితర ఇంగ్లిష్ పత్రికలతో మొదలైన రాఘవాచారి పత్రికారచన “విశాలాంధ్ర”తో సమగ్రతను సంతరించుకుంది.
ఇక సంపాదకుడిగా ఆయన సాధించిన ఘన విజయం ఒకటుంది. “విశాలాంధ్ర” పత్రికలో రాఘవాచారి ఎన్నెన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. సొదుం రామ్మోహన్, ఆర్వీయార్ మేస్టారు , డీవీవీఎస్ వర్మ, మానం ఆంజనేయులు (సంజీవి పేరుతో డాల్ఫిన్స్ నోట్ అనే కాలమ్ రాసేవారు!) తదితర కాలమిస్టుల్ని విశాలాంధ్రలో పరిచయం చేసిన విశిష్టత ఆయనదే. మల్లిక్ “టుమ్రీలు” మొదలైంది కూడా ఆయన సంపాదకత్వంలోనే అని గుర్తు. ఈ టుమ్రీలకు కొన్నాళ్ళు టీవీగారూ, కొన్నాళ్ళు మోహన్ కార్టూన్ బొమ్మలు వేశారు. డెబ్భై శతకం నాటికి ప్రధానంగా కార్మికులూ, కర్షకుల వాణిగా ఉండిన ఆ పత్రికకు “మధ్యతరగతి బుద్దిజీవుల”లో ఆమోదయోగ్యతను సంపాదించి పెట్టిన సంపాదకుడు రాఘవాచారి గారు. మధ్యతరగతి బుద్ధిజీవులను  కార్మిక కర్షకులకు మిత్ర వర్గంగా భావించే వాళ్ళు రాఘవాచారి సాఫల్యాన్ని ప్రశంసించడం సహజం. అందుకు భిన్నంగా ఆలోచించే వాళ్ళు కూడా, ఆ వర్గం కష్టజీవులకు దూరమై, వ్యతిరేకంగా పరిణమించకుండా చూడడంలో రాఘవాచారి పాత్రను ప్రశంసించడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం.
“పాపం, ప్రతిభావంతుడైన రాఘవాచారి విశాలాంధ్ర పంజరంలో చిక్కి, పత్రికారంగానికి పూర్తిగా ఉపయోగపడకుండా పోయాడు!” అంటూ సానుభూతి ప్రకటించే మిత్రశత్రువులను రాఘవాచారి ఎన్నడూ మన్నించలేదు. తాను వామపక్ష ఉద్యమంతో మమేకమై పనిచేసిన కారణంగానే, తన మూర్తిమత్వం అంతటి విశిష్టతనూ, ప్రజ్ఞనూ సంతరించుకోగలిగిందని రాఘవాచారిగారు తరచూ అనేవారు.
మంచి వక్తగానూ, సంభాషణా చతురుడుగానూ, పత్రికా ప్రపంచం పాలిట నడిచే విజ్ఞాన సర్వస్వంగానూ రాఘవాచారి సుప్రసిద్ధులు. ప్రత్యేకించి భారత రాజ్యాంగ చట్టం గురించీ, మన చట్టాల సారం గురించీ, న్యాయకోవిదులనిపించుకున్న వారి దృష్టికోణం గురించీ సోదాహరణంగా మాట్లాడగలిగే సామర్ధ్యం రాఘవాచారి సొంతం. అన్నిటికీ మించి, తొలితరం కాకపోయినా మలితరం నాయకుడిగా పత్రికా రచయితల ఉద్యమాన్ని నిర్మించిన చరిత్ర రాఘవాచారి గారిది.
పుట్టింది వరంగల్ జిల్లా పాలకుర్తి దగ్గిరే అయినా, మేనమామల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాపై మమకారం కలిగివున్నా, విజయవాడతో రాఘవాచారి అనుబంధం విశిష్టమైంది. అది జర్నలిజానికి పరిమితమైంది కాదు. ముఖ్యంగా  సీపీఐ అధికార పత్రిక  “విశాలాంధ్ర”కే ఎంతమాత్రం పరిమితం కాలేదు. సభలూ సమావేశాల్లో -అరుదుగానే అయినా- అర్థవంతమైన చర్చ జరిగేలా చూసేందుకు రాఘవాచారి శక్తివంచనలేకుండా కృషి చేసేవారు. సభలనూ, సమావేశాలనూ నిర్వహించే పద్ధతిలో సమూలమైన మార్పు తీసుకొచ్చారాయన. వేదిక ఎక్కగానే జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ ఉపప్రాంతీయ సమస్యలన్నిటినీ కెలుక్కుని, ఏళ్లతరబడి మాట్లాడే మైకాసురులకు కాలజ్ఞానం బోధించడానికి రాఘవాచారి జంకేవారు కాదు. పుస్తకావిష్కరణ సభల్లో తమ విజ్ఞాన సర్వస్వాన్నీ ఆవిష్కరించాలని తాపత్రయపడే అత్యుత్సాహులకు ఆయన కళ్లెం బిగించేవారు. దూర ప్రాంతాల్లో నివసించే నాగరికుల పరంగా ఆలోచించి మాట్లాడమని -సరసంగానే అయినప్పటికీ- హెచ్చరించేవారు. ఫలితంగా ఒకప్పుడు పీడకల పాటిగా వుండే విజయవాడ సభలు యత్కిఞ్చిత్ మానవత్వం సంతరించుకున్నాయి. ఇందుకు రాఘవాచారి గారికి విజయవాడ పౌరులు కలకాలం రుణపడివుండాలి!
ముఖ్యంగా, డెబ్భై దశకంలో తెలుగు పత్రికలు చదవడం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ప్రారంభించిన మా తరానికి రాఘవాచారి గారు గొప్ప ఆదర్శంగా నిలిచారు. తెలుగు పత్రికల ప్రతిధ్వనులకే పరిమితం కాకుండా, మౌలికమైన ఆలోచనల కోసం ఏయే వనరులను సంప్రదించాలో సూచించేవారాయన. ఏయే నగరాల్లో ఏయే లైబ్రరీల్లో విదేశీ పత్రికలు దొరుకుతాయో ఓపిగ్గా వివరించేవారు. పాతకాలపు సాహిత్యాన్ని, ఎందుకు, ఎలా చదవాలో శ్రద్ధగా బోధించేవారు. అలాంటి రాఘవాచారి ఇక లేరనుకుంటే, బెంగగా అనిపించడం సహజం. “అబ్బే! మనం ఇలాంటివాటికి అతీతంగా ఉండాలోయ్!” అని రాఘవాచారి ఎప్పుడూ అనలేదు- అదే ఆయన విశిష్టత!

 

మందలపర్తి కిషోర్