మరో పుల్వామా దాడి!

ముంబై:  మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు దగ్గర్లో పుల్వామా తరహా ఉగ్రదాడి జరుగుతుందని చెప్పారు. రాబోయే రెండునెలల్లో అచ్చం అలాంటి దాడినే చేయిస్తారని అన్నారు. తన మాటలు గుర్తుంచుకోవాలని ఎంఎన్ఎస్ 13వ వార్షికోత్సవంలో తెలిపారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్ ఠాక్రే చాలా ఆవేశంగా మాట్లాడారు. ప్రజాసమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా చేస్తారన్నారు. దీని వల్ల ప్రజల్లో దేశభక్తి భావం పొంగుతుందన్నదే వారి ఉద్దేశమని ఎద్దేవా చేశారు. దానివల్ల ఓట్లు సంపాదించవచ్చన్నది బీజేపీ ఆలోచనగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ విఫలమయ్యారని విమర్శించారు. చివరకు రామ మందిరం కూడా కట్టలేకపోయారని రాజ్ గుర్తుచేశారు.

మహారాష్ట్రలో శివసేన, బీజేపీ చాలాకాలం వరకు కొట్టుకున్నా చివరకు పొత్తు పెట్టుకున్నాయి. ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. కానీ.. ఠాక్రేల కుటుంబ సభ్యుడే అయిన రాజ్ ఠాక్రే మాత్రం వేరుకుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే. మరాఠీ భావనను ప్రజలలో రేకెత్తించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పెద్దగా ఫలితాలు రాకపోయినా ఆయన మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.