NewsOrbit
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో మాటల యుద్ధం

Share

అమరావతి: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్ష సభ్యుల వాగ్వివాదానికి దారి తీసింది. అధికార పక్ష సభ్యులు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని  ఆరోపిస్తే విపక్ష సభ్యులు ప్రతివిమర్శలు చేశారు.

గవర్నర్ ప్రసంగంలో అభివృద్ధి, సంక్షేమం వివరాలు ఏమిలేవనీ, రాజధాని అమరావతి నిర్మాణలపై ఒక్క ముక్క చెప్పలేదని  టిడిపి నేత అచ్చెన్నాయుడు అన్నారు. పట్టిసీమ వృధా ప్రాజెక్టు అయితే మోటార్లు ఆన్ చేయడం మానండి అని అచ్చెన్నాయుడు అన్నారు. మోటార్లు ఆన్ చేయడం మానేస్తే రైతులకు ఎంత ఆగ్రహం వస్తుందో మీరే చూస్తారని అచ్చెనాయుడు పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఖర్చుపైనే కాదు, ప్రయోజనాలపైనా మాట్లాడాలని అచ్చెన్నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తి చేశామనీ, మిగిలిన 30శాతం పనులు త్వరగా పూర్తి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రకృతి సంపదను టిడిపి ప్రభుత్వం నాశనం చేసిందని గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదని గోవర్థన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనీ, పేదవారికి ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీ విషయంపై గోవర్థన్ రెడ్డి  మాట్లాడుతూ తనిఖీలు చేయకుండా ఉండటానికి చంద్రబాబు ఏమన్నా చట్టానికి అతీతుడా అని ప్రశ్నించారు.

మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తన ప్రసంగంలో నీరు చెట్టు ప్రాజెక్టులో, ధర్మపోరాట దీక్షల పేరుతో, పోలవరం నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ నుండి కేవలం 23మందే గెలిచారనీ ‘ఆలీబాబా 23దొంగలు’ అని అనిల్ అన్నారు.  దీనిపై టిడిపి సభ్యుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఐదేళ్లలో సమర్థవంతమైన పాలన అందించిందనీ, కొన్ని కారణాల వల్ల ఓడిపోయామని అచ్చెన్నాయుడు అన్నారు. ఏమి తెలియని అనిల్ కుమార్ ఇప్పుడు మంత్రి అయి చంద్రబాబుకే ఇరిగేషన్ పాఠాలు చెబుతుంటే బాధేస్తోందని అచ్చెన్నాయుడు అన్నాడు. దీనికి అనిల్ కుమార్ స్పందిస్తూ తనకేం తెలియకున్నానేర్చుకుంటాననీ, మంగళగిరిని మందలగిరి అని కూడా పలకలేని వాడిని కాదని సెటైర్ వేశారు. కనీసం ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత టిడిపిదేనని అనిల్ నారా లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు.

ప్రతిపక్షంలో కూర్చున తరువాతైనా మాజీ మంత్రి అచ్చెన్నాయుడులో మార్పు వస్తుందని అనుకున్నాము కానీ ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పట్టుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సర్పంచ్‌లను కాదనీ జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చారనీ అందుకే ప్రజలు తమకు 151 సీట్లు ఇచ్చారని అన్నారు. గత ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు అప్పు చేశారనీ బుగ్గన ఆరోపించారు. పట్టిసీమలో 400కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాగ్ వెల్లడించిందని బుగ్గన అన్నారు. పట్టిసీమ బదులు పోలవరం పనులు వేగవంతం చేస్తే ఇప్పటికే పూర్తి అయ్యేదని బుగ్గన అన్నారు. టిడిపి హయాంలో అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్లు తప్ప మరొకటికాదని బుగ్గన ఎద్దేవా చేశారు.

వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ విపక్షం నుండి సద్విమర్శలు చేస్తే స్వాగతిస్తామనీ, అంతుచూస్తామంటూ మాట్లాడితే మాత్రం ఊరుకునేలేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేల గురించి అంబటి మాట్లాడుతూ గెలిచేది తామే రాసుకో రాసుకో అని చెప్పిన వారెవరూ ఇక్కడ లేరు, ఒక్క అచ్చెన్నాయుడే ఉన్నారు. ఆయనా రేపుండరు అనగా అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటమి సర్వసాధారణమనీ, ఓటమి పాలైన వారు అసమర్థులు కారని అచ్చెన్నాయుడు అన్నారు. సభలో లేని వారి పేర్లు ప్రస్తావించడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.


Share

Related posts

మోదీ చేతిలో ఉన్నదేంటి?

Mahesh

తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం తెరాస

Siva Prasad

ఫేక్: బిజేపీకి బెలూచిస్థాన్ లో మద్దతు!

Kamesh

Leave a Comment