రాహుల్‌కు షాకిచ్చిన బాబు!

విశాఖ, డిసెంబర్ 22: భాజపా వ్యతిరేక ఫ్రంట్‌లో ప్రధాని అభ్యర్థిగా ఎవర్నీ నిర్ణయించలేదని, రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొనలేదని ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. విశాఖలో శనివారం జరిగిన ‘ఇండియా టుడే  కాంక్లేవ్ 2018’లో ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరనే దానిపై నిర్ణయానికి వస్తాన్నారు. భాజపా, కాంగ్రెస్‌ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి ప్రయోజనాల కోసమే భాజపా వ్యతిరేక ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణలో మహాకూటమిగా పోటీచేశామన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల్లో మోదీపై వ్యతిరేకత కనిపించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటూ మోదీ తమపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఫోన్లను సైతం ట్యాపింగ్‌ చేస్తూ గోప్యతకు భంగం కలిగిస్తున్నారని  విమర్శించారు. సీబీఐ కంటే ఏసీబీ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. సీబీఐ పనితీరు బాగాలేనందునే రాష్ట్రంలోకి అనుమతించ వద్దని నిర్ణయించామన్నారు.

పీవీ నరసింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపినా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేస్తూ  మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నా మార్పులు తీసుకురాలేకపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.