అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి స్వయంగా టిక్ టాక్‌లో చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న’ అనే పాటకు ఆమె టిక్ టాక్ చేశారు. పాటకు అనుగుణంగా అభినయిస్తూ టిక్ టాక్ చేసి ఆమె పోస్టు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ ఈ పాటను రిలీజ్ చేసింది. మంగ్లీ పాడిన ఈ పాట.. ఏపీ ప్రజలను ముఖ్యంగా రాయలసీమ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌ను ప్రశంసిస్తూ పుష్ప శ్రీవాణి చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవలే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో సచివాలయం ఉండొచ్చన్నారు. దీంతో అటు సీమలో, ఇటు ఉత్తరాంధ్రలో జగన్ నిర్ణయం పట్ల సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. ఈ టిక్ టాక్ వీడియో చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కురుపాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జగన్ డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు.