అమరజీవికి అవమానం

అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తొలి సారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు చోటు కల్పించకపోవడం  విమర్శలకు దారి తీస్తున్నది.

రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నవంబర్ ఒకటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హజరుకానున్నారు.

వేడుకలను ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని నిర్ణయించడం బాగానే ఉంది కానీ ప్రభుత్వం ముద్రించిన ఆహ్వాన పత్రంపై ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం 58రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఫోటో ముద్రించకపోవడంపై పలువురు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.

ఆహ్వాన పత్రంపై మహాత్మా గాంధీ,  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, , పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోటోలను మాత్రమే ముద్రించారు. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో జరిగే వేడుకలకు సంబంధించి ముద్రించిన ఆహ్వాన పత్రంలోనూ పొట్టి శ్రీరాములు చిత్రాన్ని ముద్రించలేదు. ఈ ఆహ్వాన పత్రంపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో పాటు తెలుగుతల్లి ఫోటోలను మాత్రమే ముద్రించారు. రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన రెండు ఆహ్వాన పత్రికల్లోనూ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రం లేకపోవడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.

దీనిపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందించి ప్రభుత్వాన్ని విమర్శించారు.

‘వెనకటికి ఒకడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లికి సిద్ధమయ్యాడట, అలాగే ఈ రోజు ఆంధ్రావతరణ దినోత్సవ పోస్టర్‌లో అసలు సూత్రధారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఏది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘ఆసలు ఆయన గురించి మీ ప్రభుత్వానికి తెలుసా’ అని ప్రశ్నించారు. ‘ఆయన ఆత్మ త్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్రవతరణ అని తెలుసుకోండి’ అని వర్ల రామయ్య అన్నారు.