ఏప్రిల్ 7 నుండి అమరావతిలో ఏపీ హైకోర్టు

2019 ఏప్రిల్‌ 7వ తేదీ నుండి ఆంద్రప్రదేశ్ రాజధాని  అమరావతిలో హైకోర్టు విధులు నిర్వహించనుంది. ఈ మేరకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సెలవుల అనంతరం హైకోర్టు తరలింపు ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ 7న ఉగాది కావడంతో హైకోర్టు అపాయింట్ మెంట్ డేగా ప్రకటించారు. అధికారికంగా ఉగాది నుండి అమరావతిలో పనిచేయడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో తెలంగాణా, ఆంధ్రప్రదేశే రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉండగా ఇక నుండి ఏపీ తెలంగాణా కోర్టులుగా విడిపోనుంది. ఇప్పటికే న్యాయమూర్తులు, సిబ్బంది విభజన కూడా పూర్తయింది.

ఇటీవల న్యాయమూర్తుల బృందం హైకోర్టు భవన నిర్మాణాలు, టవర్‌ల నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకూ నివేదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఏడాది  31వ తేదీనాటికి హైకోర్టు భవనాలు పూర్తవుతాయని, దీనిపై వెంటనే జ్యుడీషియల్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని సిఆర్‌డిఏ అధికారులను ఆదేశించారు.