అమరావతి, ఏప్రిల్ 20: వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి, మాజీ సిబిఐ అధికారి (జెడి) వివి లక్ష్మీనారాయణల మధ్య ట్వీట్ల యుద్దం ఆసక్తికరంగా కొనసాగుతోంది.
గతంలో రాజకీయ నాయకులు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రత్యర్థులపై విమర్శలు చేయడం, వాటిని చూసి ప్రత్యర్థులు వీరిపై విమర్శలు చేయడం జరుగుతుండేది.
అయితే నేడు ఎక్కువ మంది రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా వేదికగా) ద్వారానే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.
జనసేన పార్టీ పోటీ చేసిందే 65 స్థానాల్లో అయితే 88 స్థానాలు గెలుచుకొని జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నాడని విజయసాయి రెడ్డి నిన్న ట్వీట్ చేస్తూ ఆయన దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్లు రాసాడని విజయసాయి విమర్శించారు.
ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా అంటూ విజయసాయి ప్రశ్నించారు.
దీనిపై లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. ‘జనసేన 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బిఎస్పి 21, సిపిఐ., సిపిఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.’
‘మీరు సిఎ చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి, ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.’ అని వివి లక్ష్మీనారాయణ కేంటర్ ఇచ్చారు.
దీనిపై నేడు విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు.
‘గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి.’ అంటూ విమర్శించారు. అంతటితో ఆగకుండా మరో మూడు ట్వీట్లు చేశారు.
‘పాపం! బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం మీకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ? ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు.’ అని పేర్కొన్నారు.
‘His Master’s Voice (HMV) అన్న బిరుదు మీకు చక్కగా సరిపోతుంది జేడీ గారూ. తెలుగుదేశంలో చేరాలనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక, మీ బాస్ చెప్పినట్టు ఆఖరిక్షణంలో జనసేనలో చేరారు. మీ కమిట్మెంట్ను అభినందించాల్సిందే. ఒకటి నుంచి ఐదు అంకెల్లో ఏది లక్కీ నంబరో వెతుక్కుని లెక్కలు వేసుకోండి. మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది. ‘ప్రశ్న ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే’ ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది.’ అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. వీటిపై వివి లక్ష్మీనారాయణ ఏ విధంగా స్పందించి సమాధానాలు ఇస్తారో వేచి చూద్దాం.