ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు

అమరావతి: తెలంగాణ తరహాలో ఏపీలోనూ ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఇతర బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు. దీనిపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలంటే చార్జీల పెంపు తప్పదని అన్నారు. ఆర్టీసీని బతికించాలన్నదే తమ ప్రయత్నమని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొత్తం రూ.6735 కోట్ల అప్పు ఉందని మంత్రి పేర్ని నాని చెప్పారు. బ్యాంకులు, వివిధ సంస్థల నుంచి తెచ్చిన అప్పులు రూ.2995 కోట్లు ఉంటే, ఇతరత్రా బకాయిలు అన్నీ కలిపి రూ.3,740 కోట్లు అయ్యాయన్నారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల కూడా ఆర్టీసీపై భారం పడిందని చెప్పారు. 2015లో డీజిల్ ధరలు లీటర్ సుమారు రూ.50 ఉంటే, ఇప్పుడు లీటర్ రూ.70 వరకు చేరిందన్నారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల సంస్థ మీద ఏటా సుమారు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు భారం పెరుగుతోందన్నారు. ఆ నష్టాలను నివారించేందుకు, ఆర్టీసీకి జీవం పోసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 2015 తర్వాత ఆర్టీసీ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. చార్జీలు పెంచాలన్న ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తికి సీఎం జగన్ ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదని చెప్పారు. ఆర్టీసీని నేరుగా ప్రభుత్వంలో విలీనం చేయడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అన్నీ సర్వీసులపై 20 పైసలు పెంచారు. సంస్థ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఆర్టీసీ చార్జీలను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాటనే ఏపీ సీఎం జగన్ ఎంచుకున్నారు. చార్జీల పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టాలు వస్తున్నా.. నాలుగేళ్లుగా చార్జీలు పెంచలేదు. భారీ నష్టాలు, పెరుగుతున్న డీజల్‌ ధరల నేపథ్యంలో చార్జీలు పెంచాలని ఆర్టీసీ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తరహాలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలని నిర్ణయించింది.