‘బాబరీ మసీదు విధ్వంసం నేరమే’!

న్యూఢిల్లీ: బాబరీ మసీదు కూల్చివేత చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని కోర్టు పేర్కొన్నది. రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం  ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు అప్పగించాలనీ కోర్టు తీర్పు చెప్పింది. కేంద్రం మూడు నెలల్లో ఆ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.

1992 డిసెంబర్ ఆరున కరసేవకులు బాబరీమసీదును నేలమట్టం చేసిన చర్యను  ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఎల్.కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వంటి బిజెపి అగ్ర నాయకులు ఒక పక్కన వేదికపై నుంచి చూస్తుండగా వేలాది మంది కరసేవకులు గంటల్లోనే బాబరీ మసీదును నేలమట్టం చేశారు. అప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వం పాలిస్తున్నది. పివి నరసింహారావు ప్రధానిగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నది. ఆనాటి బాబరీ మసీదు విధ్వంసానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసు ఇంకా విచారణలో ఉన్నది.