ఆరు నెలలకే ముచ్చట తీరింది!

అమరావతి: ఎన్నికలకు ముందు వివాదాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రమణ్యంకు నేడు మరో వివాదం కారణంగా బదిలీ వేటు పడింది.

ఎన్నికల సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సిఎస్ ఎల్వీ ఇబ్బందులు పెట్టడం నాటి వైసిపి అధినేత జగన్‌కు అనుకూలంగా పరిణమించింది. ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఎల్వీనే సిఎస్‌గా కొనసాగించారు. అయితే ఆరు నెలలు తిరగకముందే ఆయనకు బదిలీ బహుమతిగా ఇచ్చారు.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసిపి నేతల ఫిర్యాదుతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠాను ఎన్నికల సంఘం బదిలీ చేసి ఎల్‌వి సుబ్రమణ్యంను సిఎస్‌గా నియమించింది. నాడు సిఎస్ బదిలీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టిడిపి నేతలు తప్పుబట్టారు. జగన్ అక్రమాస్తుల కేసులో సహా నిందితుడుగా ఉండి సస్పెండ్‌కు గురైన ఎల్వీని సిఎస్‌గా నియమించడం ఏమిటంటూ ప్రశ్నించారు. రిటైర్డ్ ఐఎఎస్‌ల సంఘం నేత ఐవైఆర్ కృష్ణారావుతో సహా పలువురు నాడు ఎల్వీకి మద్దతుగా మాట్లాడారు. ఎల్‌వి సుబ్రమణ్యం కొద్ది రోజుల పాటు నాటి సిఎం చంద్రబాబుతో ఎడమొహం పెడమోహంగా ఉన్నారు. అప్పటి వివాదాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం వైసిపి ప్రభుత్వం వస్తే తానే సిఎస్‌గా కొనసాగుతాననీ, ఒక వేళ టిడిపి అధికారంలోకి వస్తే వారు కోరుకున్న అధికారి సిఎస్‌గా వస్తారనీ కూడా నాడు ఎల్వీ వ్యాఖ్యానించారు. వైసిపి అధికారంలోకి రావడంతో సిఎం జగన్మోహనరెడ్డి ఎల్వీనే సిఎస్‌గా కొనసాగించారు.

అయితే తనకు తెలియకుండా తన కార్యాలయంలోని ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు ఎల్వీ షోకాజ్ నోటీసు ఇవ్వడంపై సిఎం జగన్‌కు ఆగ్రహం తెప్పిందని అనుకుంటున్నారు. అందుకే ఆయనపై అర్ధంతరంగా బదిలీ వేటు వేసినట్లు ఐఎఎస్ వర్గాలు భావిస్తున్నాయి.