హుజూర్‌నగర్‌లో జోరుగా బెట్టింగ్?

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే 18 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న టీఆర్ఎస్…ఫలితాలు పూర్తయ్యే సమయానికి భారీ మెజార్టీ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఉపఎన్నికపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గం వ్యాప్తంగా నేతలు బెట్టింగ్‌లు కాసినట్టు సమాచారం. విజయం మీదే కాకుండా మెజార్టీ మీద కూడా పందేలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలపైనే ఈ పందేలు నడుస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ. 10 కోట్లకు పైగానే బెట్టింగ్ నడుస్తున్నట్టు సమాచారం. ఈ నెల 21న జరిగిన పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ను ఆధారంగా కొందరు బెట్టింగ్‌కు దిగితే… గత అనుభవాలను దృష్టిలో పెట్టకుని మరి కొందరు బెట్టింగ్ కానినట్టు తెలుస్తోంది.

మరోవైపు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేవరకు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోగా, ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి పేర్కొన్నారు.