ప్రధాని మోదీపై ఊర్మిళ విమర్శలు
ముంబై: సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాజీ నటి ఊర్మిళా మథోంకర్.. ప్రధాని మోదీపై విమర్శలు మొదలుపెట్టారు. ప్రభుత్వాధినేతగా అన్ని విషయాల్లో విఫలమైన ఆయన బయోపిక్ తీయించుకోడానికి అనర్హుడని, అందువల్ల ఆయనపై కామెడీ సినిమా తీయాలని అన్నారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకొనే మోదీ అన్ని రంగాలలో దారుణంగా విఫలమయ్యారన్నారు. ఆయన జీవితం మీద తీసిన సినిమా ప్రజాస్వామ్యం మీద, పేదరికం మీద, భారతదేశ వైవిధ్యం మీద జోకు అవుతుందని, ఇవన్నీ దారుణంగా పాడయ్యాయని ఊర్మిళ విమర్శించారు. అందుకే ఆయన మీద, ఆయన అసంపూర్తి హామీల మీద కామెడీ సీనిమా తీయాలన్నారు.
తాను ప్రధాని మోదీకి అభిమానినని చెప్పుకొనే హీరో వివేక్ ఒబెరాయ్ నటించిన పీఎం నరేంద్రమోదీ సినిమాను ఎన్నికలు అయ్యేవరకు విడుదల చేయొద్దని ఈసీ ఆదేశించింది. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద వివేక్ ఒబెరాయ్ ఇంతకుముందు చేసిన వ్యాఖ్యనే దాదాపుగా ఊర్మిళ కాపీ కొట్టారు. ‘‘రాహుల్ గాంధీ మీద నేనెందుకు బయోపిక్ చేయాలి? ఆయన చేసిన వాటిలో చెప్పుకోదగ్గవి ఏమున్నాయి? అలా చేస్తే చాలావరకు సినిమాను థాయ్ లాండ్ లో షూటింగ్ చేయాల్సి ఉంటుంది’’ అని గతంలో ఎద్దేవా చేశారు. దక్షిణ ముంబైలో సిటింగ్ బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ పోటీ చేస్తున్నారు.