ఇంత నేలబారుతనమా!?

50 views

 

రాజకీయ పార్టీలు ఎంత నేలబారు స్థాయిలో ఉన్నాయో తెలిపే సంఘటన ఇది. ప్రత్యర్ధి పార్టీలను సిద్ధాంతాలు, కార్యక్రమాల ప్రాతిపదికగా ఎదుర్కొనే రోజులు పోయి వ్యక్తిగత దూషణలకూ, అవహేళనలకూ పాల్పడడం క్రమేపీ ఎక్కువవుతోంది.

2015 ఢిల్లీ శాసనసభ మధ్యంతర ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో మట్టి కరిచిపోయిన దగ్గర నుంచీ బిజెపి అవమాన భారంతో రగిలిపోతూనే ఉంది. అంతకు ముందు 2013లో జరిగిన ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలిచి రెండేళ్లలో మూడు స్థానాలకు పడిపోయిన బిజెపి ఆనాటి నుంచీ ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూనే ఉంది.

సిరా దగ్గర నుంచీ కారం వరకూ కేజ్రీవాల్‌పై రకరకాల దాడులు జరిగాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియమించిన ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ ఆప్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతూ వచ్చారు. తాజాగా కేజ్రీవాల్‌ను అవమానించేందుకు బిజెపి కార్యకర్తలు ఎంచుకున్న పద్ధతి అసహ్యకరంగా ఉందని అందరూ అంటున్నారు.

యమునా నదీ జలాల ప్రక్షాళనకు సంబంధించి గురువారం ఢిల్లీలో జరిగిన ఒక అధికారిక సమావేశంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. కేజ్రీవాల్ లేచి ప్రసంగం ప్రారంభించబోతుండగా ముందు వరసలో కూర్చున్న బిజెపి కార్యకర్తలు ఒక్కుదుటున లేచి దగ్గడం మొదలుపెట్టారు. సభికులు అందరూ నివ్వెరపోయారు.

కేజ్రీవాల్‌కు చాలా కాలంగా దగ్గు సమస్య ఉన్న సంగతి తెలిసిందే. చివరికి ఆయన 2016లో బెంగుళూరులో ఆ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. కేజ్రీవాల్ దగ్గును వెక్కిరించడం బిజెపి కార్యకర్తల లక్ష్యం. నిజానికి ఆయన దగ్గు సమస్యను గతంలో కూడా నవ్‌జోత్ సింగ్ సిద్ధు, మనోహర్ పరికర్ వంటి నాయకులు వెక్కిరించి తమను తాము తక్కువ చేసుకున్నారు. గురువారం నాటి సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేచి తమ కార్యకర్తలను వారించాల్సి వచ్చింది.