పవన్ పాటకు సీఎం డ్యాన్స్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలోని పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన భార్యతో కలిసి స్టెప్పులేశారు. ఆయన కొడుకు రిత్విక్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సందర్భంగా జరిగిన వేడుకల్లో డ్యాన్సులతో అదరగొట్టారు. అత్తారింటికి దారేది సినిమాలో బాపుగారు బొమ్మ పాటకు రమేష్ సతీమణితో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. సీఎం రమేష్ దంపతులు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సీఎం రమేష్  కుమారుడు రిత్విక్‌‌‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త తూళ్లూరి రాజా కూతురు పూజ నిశ్చితార్థం ఆదివారం రాత్రి దుబాయ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీలో పార్టీలకు అతీతంగా అందరికి సీఎం రమేష్ నుండి ఆహ్వానాలు అందాయి. బీజేపీ, టీడీపీతో పాటుగా వైసీపీ నేతలకు కొందరికి సీఎం రమేష్ నుండి ఆహ్వానం అందింది. దీని మీద రాజకీయంగా చర్చ సాగినా.. వ్యక్తిగత సంబంధాలతోనే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అతిథుల కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు కూడా ముందుగానే బుక్ చేశారు. నిశ్చితార్థ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో అంతా స్టెప్పులు వేశారు. కొడుకు నిశ్చితార్థంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు. పవన్ పాటకు సీఎం రమేష్ దంపతులు చేసిన డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పుడు సీఎం రమేష్ డాన్సు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.