టిడిపి ఎమ్మెల్యేలపై బిజెపి వల!

అమరావతి: రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి.. వివిధ పార్టీల నుండి బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది.

నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో టిడిపి ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ, టిజివిఆర్ నాయుడు భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అన్ని పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నామన్నారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజెపి నెంబర్ ఒన్ ప్లేస్‌లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ మేరకు పార్టీ రాజకీయ వ్యూహాన్ని రచిస్తోందని చెప్పారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బిజెపి నేతలతో భేటీ అయ్యారా అన్న విషయంపై మాట్లాడుతూ  అనేక మంది నాయకులు కలుస్తున్నారని అన్నారు. బలమైన నాయకులను తామూ కలుస్తున్నామనీ ఆయన చెప్పారు.

మోది పరిపాలనా దక్షతకు అనేక మంది ఆకర్షితులు  అవుతున్నారని సోము చెప్పుకొచ్చారు. మోదిని చూసి అనేక మంది నాయకులు దేశభక్తులుగా మారాలనుకుంటున్నారని సోము అన్నారు. రాజకీయ ప్రయోజనాలు, ప్రాంతాల అభివృద్ధి తదితర కారణాల వల్ల కూడా బిజెపి పట్ల ఆకర్షితులు అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

గంటా శ్రీనివాసరావు గతంలోనే ఢిల్లీకి వెళ్లి బిజెపి జాతీయ నాయకుడు రాంమాధవ్‌తో చర్చలు జరిపారని ప్రచారం జరుగుతున్నది.