బీజేపీ పీచే హట్.. మోడీ జట్టు కట్..!!

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత నరేంద్ర మోడీకి ఇక ఎదురులేకుండా అయిపోయింది. వివిధ రాష్టాల్లో ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ఎజెండాగా ముందుకు సాగుతూ సక్సెస్ అవుతూ వస్తున్నారు.  ప్రాంతీయ పార్టీల అధినేతలను నయానో భయానో లొంగదీసుకుంటున్నారు. రాజ్యసభలో బలం లేకపోయినా కీలక బిల్లులను పాస్ చేయించేసుకుంటున్నారు నరేంద్ర మోడి. ఈ కారణంగా మోడీ తీసుకునే కీలక నిర్ణయాలను ఎవరు ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా పోయింది.

Narendra Modi

అయితే ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలతో పాటు భాగస్వామ్య పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతాంగం తీవ్ర ఆందోళనలు చేస్తున్నది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ బీ జే పీ భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాళీదళ్ కేంద్ర మంత్రి పదవినే త్వజించి బయటకు వచ్చేసింది. పలు రాష్ట్రాల్లో రైతాంగం తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లు చట్టరూపం దాల్చడం రైతాంగానికి రానున్న రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని లోకం కోడై కూస్తున్నా కేంద్రంలోని బీ జే పికి ఏ మాత్రం చెవికి ఎక్కడం లేదు. వ్యవసాయ రంగం కార్పోరేట్ వశం అయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక, వ్యవసాయ రంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో పక్క కరోనా సాకుగా చూపి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీ ఎస్ ‌టి పరిహారాలకు మంగళం పాడింది. జీఎస్‌టీ బకాయిలు ఇచ్చేది లేదంటూ రాష్ట్రాలకు స్పష్టం చేస్తూ అవసరమైతే అప్పులు ఇప్పిస్తాం తీసుకోండి అంటూ రాష్ట్రాలకు సూచించింది. ఇటీవల కాగ్ కేంద్రం చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. జీ ఎస్‌ టి లెక్కలను తప్పుగా చూపి రాష్ట్రాలకు చెల్లించాల్సిన 47,272 కోట్ల రూపాయలను ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలకు మళ్లించిందని కాగ్ స్పష్టం చేసింది. సమర్థవంతమైన ప్రతిపక్షం లేనప్పుడు అధికార పక్షం ఏమి చేసినా చూస్తూ భరించడం తప్ప చేసేది ఏమి ఉంది? అందుకేనేమో చాలా రాష్ట్రాల ముఖ్య మంత్రులు జీ ఎస్ ‌టీ బకాయిలపై గట్టిగా అడగడం లేదు!. రైతాంగానికి నష్టం చేకూర్చే వ్యవసాయ బిల్లుపై నోరూ మెదపడం లేదు!.