టాప్ స్టోరీస్

మాట గాయం చేస్తుంది జాగ్రత్త!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఒక్లహామా నగరంలోని జూలో ఉన్న గొరిల్లాతో ఈ కథ మొదలయింది. ఫిన్ అనే ఆ గొరిల్లా సెల్ఫీలు తీసుకోగలదు. అలా సెల్పీలు తీసుకుంటున్న వీడియోను ఆ ఉదయం టివి షోలో చూపించారు.

ఛానల్ పేరు కోకొ 5 టివి (KOCO 5 TV). ఇద్దరు యాంకర్లు ఆ షో నడుపుతారు. వారిలో జేసన్ హాకెట్ నల్ల జాతి పురుషుడు.  ఎలెక్స్ హౌస్డెన్ తెల్ల జాతి మహిళ. ఫిన్ సెల్ఫీలు తీసుకుంటున్న వీడియో చూపిస్తూ ఆ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.

హౌస్డెన్: చూసావా ఫిన్ ఎంత పరవశంగా ఉందో

హాకెట్: అవును, క్లోజ్ అప్‌కు రెడీగా ఉంది.

ఇంతలో వీడియో పూర్తయింది. తర్వాతి వార్త నగరంలో ట్రాఫిక్ గురించి. సడెన్‌గా హౌస్డెన్ ఓ మాట అన్నది: ‘నువ్వు ఫొటో తీసుకుంటున్నపుడు ఎట్లా కనబడతావో అట్లా ఉంది’.

హాకెట్ ఒక్క క్షణం ఆగి ‘అవును, అట్లాగే కనబడుతోంది. కెమేరాకు బాగా  దగ్గరగా ఉన్నపుడు’ అన్నాడు.

వెంటనే ఆ టివి ఛానల్‌పై సోషల్ మీడియాలో దాడి మొదలయిది. చాలామంది ఫోన్ చేసి తీవ్రమైన అభ్యంతరం వెలిబుచ్చారు. హౌస్డెన్ మాటలు జాత్యహంకారం, నల్లజాతిని మూసలో చూడడం తప్ప మరోటి కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో నల్లజాతి వారిని కించపరచడం కోసం గొరిల్లా, చింపాంజీ వంటి ఏప్స్‌తో పోల్చడం ఈనాటిది కాదు. ఇటీవలి కాలంలో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగా రాజకీయ ప్రత్యర్ధులు ఆయన భార్య మిషెల్లీని నరవానరాలతో పోల్చారు. ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందాలను కించపరిచేందుకు అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నవారు కూడా ఈ పోలిక తెచ్చారు. నల్లజాతి వారు తక్కువరకం మనుషులన్న సిద్ధాంతం నుంచి ఈ పోలిక వస్తుంది.

మరుసటి రోజు ఉదయం హాకెట్, హౌస్డెన్ యధావిధిగా స్టూడియోలో కూర్చున్నారు. సంభాషణ మొదలుకాగానే హౌస్డెన్ రోదించడం ప్రారంభించింది. ‘ఈ ఉదయం క్షమాపణ అడగటానికి ఇక్కడ కూర్చున్నాను. జేసన్‌కు మాత్రమే కాదు, మొత్తం అందరికీ. నిన్న నేను అనకూడని మాట అన్నాను. మనుషులను బాధించాను. ఎంత బాధపెట్టానో నాకు తెలుసు. నువ్వు నాకున్న దగ్గరి స్నేహితుల్లో ఒకడివి. ఐ లవ్ యు సోమచ్. నా హృదయాంతరాళాల్లోనుంచి క్షమాపణ కోరుతున్నాను’ అని ఆమె అన్నది.

తర్వాత జేసన్ హాకెట్ మాట్లాడాడు. ‘అలెక్స్, ధాంక్ యు వెరీమచ్. నీ క్షమాపణను నేను స్వీకరిస్తున్నాను’ అని ఆమెతో చెప్పి ప్రేక్షకుల వైపు తిరిగాడు. ‘నిన్న అలెక్స్ అన్న మాట చాలా తప్పు మాట. అది ఆమే మొదట అంగీకరిస్తున్నది. ఆ మాట నన్ను గాయపరిచింది. మీలో కూడా చాలామందిని గాయపరిచిఉంటుంది. యాంకర్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది ఒక పాఠం కావాలి. మాటలు చాలా ముఖ్యం అనేదే ఆ పాఠం. ఒకరినొకరు అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి. గాయపరిచే మాటల బదులు ప్రేమ, ఆప్యాయత చూపించే మాటలు వాడాలి. మనుషులను బాధ పెట్టడం, విభజించడం కాకుండా దగ్గరకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి, అని హాకెట్ ముగించాడు.

వాషింగ్టన్ పోస్టు సౌజన్యంతో


Share

Related posts

విదేశాల్లో రికార్డు పరుగులు చేసిన కోహ్లి

Siva Prasad

పూలింగ్‌ విధానంలో భూములు వెనక్కి!

Mahesh

పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి: వైఎస్ షర్మిళ

Siva Prasad

Leave a Comment