నేతలను గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు!

రాజస్థాన్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బీఎస్పీ నేతలకు ఆ పార్టీ కార్యకర్తలు వినూత్నంగా బుద్ది చెప్పారు.  జైపూర్‌లో బీఎస్పీ రాష్ట్ర మాజీ ఇన్‌ఛార్జ్ సీతారాం, పార్టీ జాతీయ సమన్వయకర్త రాంజీ గౌతమ్ ముఖానికి నలుపురంగు పూశారు. వారి మెడకు బూట్ల దండ వేసి..ఇద్దరినీ గాడిదలపై ఊరేగించారు. రాంజీ గౌతమ్, సీతారాంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జైపూర్‌లోని పార్టీ కార్యాలయం ఆవరణలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల సమయంలో పార్టీ టికెట్లు అమ్ముకోవడంతో పాటు ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కుట్ర చేశారని కార్యకర్తలు ఆరోపించారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడాన్ని జీర్ణించుకోలేని కార్యకర్తలు ఈ దాడి ఘటనకు పాల్పడ్డారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.