ముంబైలో చెట్ల నరికివేత.. పర్యావరణ వేత్తల అరెస్ట్!

ముంబై: నగరంలోని ఆరే కాల‌నీలో ఉన్న వృక్షాల‌ను న‌రికివేసేందుకు వచ్చన మున్సిపల్ అధికారులను పలువురు సామాజిక కార్యకర్తలు అడ్డుకున్నారు. శుక్ర‌వారం రాత్రి కొన్ని చెట్ల‌ను తొల‌గించేందుకు మున్సిప‌ల్ అధికారులు ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలో వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. బుల్డోజ‌ర్లు రావ‌డంతో కొంద‌రు ఆందోళ‌న‌కారులు న‌రికివేత‌ను అడ్డుక‌న్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 38 మందిపై కేసులు నమోదు చేశామని, 20 మందిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. వీరిని ఈ రోజు కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

ఆరే కాల‌నీలో ముంబై మెట్రో కోసం అక్క‌డో కారు షెడ్డును నిర్మించ‌నున్నారు. దీని కోసం ఆ కాల‌నీలో ఉన్న భారీ వృక్షాల‌ను తొల‌గిస్తున్నారు. కోర్టు అనుమ‌తితోనే చెట్ల న‌రికివేత కొన‌సాగుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ముంబై మెట్రో కార్ షెడ్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పర్యావరణ వేత్తలకు ముంబై హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆరే ప్రాంతంలో చెట్ల నరకివేతను నిరసిస్తూ దాఖలైన నాలుగు పిటిషన్లను శుక్రవారం బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఆరే కాలనీని అటవీ ప్రాంతంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.

అది అడవి కాదనీ.. అక్కడ చెట్ల నరికివేతను నిలిపివేయాలన్న పర్యావరణ వేత్తల వాదనను తిరస్కరించింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పెండింగ్ లో ఉందని, అందువల్ల ఈ పిటిషన్లను తాము కొట్టివేస్తున్నట్టు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, జస్టిస్ భారతి డాంగ్రే ధర్మాసనం స్పష్టం చేసింది.  ఆ తీర్పు వ‌చ్చిన కొన్ని గంట‌ల్లోనే చెట్ల తొల‌గింపు ప్ర‌క్రియ మొద‌లైంది. వృక్షాల‌ను పెకిలిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ కావ‌డంతో ఆరే కాల‌నీలో భారీ సంఖ్య‌లో జ‌నం గుమ్ముగూడారు. ఆరే కాల‌నీలో కారు షెడ్డు క‌ట్టాల‌ని రెండేళ్ల నుంచి ప్ర‌తిపాద‌న న‌డుస్తున్న‌ది. అయితే ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు అడ్డుత‌గులుతున్న నేప‌థ్యంలో చెట్ల నరికివేత ఆల‌స్యం అవుతోంది.

చెట్లను నరికి మెట్రో రైలు కారు షెడ్ నిర్మాణం చేపట్టనున్నట్టు ముంబై మెట్రో రైలు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సుమారు 2700 చెట్లను నరికివేయడానికి ప్రభుత్వ అనుమతి కోరింది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా పర్యావరణ ప్రేమికులు నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉద్యమానికి పలువురు ప్రముఖులు సైతం తమ మద్దతు ప్రకటించారు.  ఇదిఇలా ఉంటే.. హైకోర్టు నిర్ణయాన్ని తాను సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్లు పర్యావరణ వేత్తలు తెలిపారు. మరోవైపు బాలీవుడ్ సినీ నటులు అమితాబ్‌, అక్ష‌య్ లాంటి వారు  ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గమనార్హం.