కాల్పులు జరగలేదు: డిజిపి, కాల్పుల్లో ఒకరు మృతి: ఎస్‌పి!

పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్ 

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క తూటా కూడా పేల్చలేదన్న ఉత్తరప్రదేశ్ డిజిపి ఒపి సింగ్ మాటలు అవాస్తవాలని తేలిపోయింది. స్వయంగా ఒక పోలీసు అధికారే డిజిపి మాటలతో విభేదించారు. బిజ్నోర్‌లో పోలీసులు కాల్పులు జరిపారనీ, ఫలితంగా సులేమాన్ అనే యువకుడు మరణించాడనీ ఆ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ త్యాగి ఎన్‌డిటివికి తెలిపారు.

సిఎఎకి నిరసనగా చెలరేగిన ఉద్యమంలో ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ  15 మంది మరణించారు. వారిలో ఒక్కరు కూడా పోలీసుల కాల్పుల్లో మరణించలేదని డిజిపి అంటున్నారు. బిజ్నోర్ సంఘటనలో సులేమాన్‌తో పాటు అనీస్ అనే యువకుడు కూడా మరణించాడు. పోలీసులు అత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో సులేమాన్ మృతి చెందాడని త్యాగి అంటున్నారు. ఐఎఎస్‌ పరీక్షలకు తయారవుతున్న తమ కుమారుడు నిరసన ప్రదర్శనలలో పాల్గొననే లేదని అతని తల్లిదండ్రులు అంటున్నారు. నమాజ్ కోసం బయటకు వెళ్లిన సులేమాన్‌ను పోలీసుల పట్టుకుని కాల్చి చంపారని వారు ఆరోపిస్తున్నారు.