‘ఆరోగ్య బీమా’ ఉంటేనే అమెరికాలో ఎంట్రీ!

వాషింగ్టన్: అమెరికాలో కాలు పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా ఆరోగ్య బీమాను కలిగివుండాలని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై శుక్రవారం ఆయన సంతకం చేశారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని వారికి అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

అమెరికాలో కాలు పెట్టే వలసదారులు తప్పనిసరిగా 30 రోజుల్లో బీమా సౌకర్యాన్ని పొందాల్సి వుంటుందని వైట్ హౌస్ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. అగ్రరాజ్యంలో ప్రవేశించిన 30 రోజుల్లోగా ఆరోగ్య బీమా తీసుకోకపోయినా అమెరికా ప్రవేశార్హత కోల్పోవాల్సి ఉంటుందని నిబంధన విధించింది. నవంబర్ 3 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించేవారికి ఈ ఆదేశాలు అడ్డుకాబోవని వైట్ హౌస్ పేర్కొంది. “సొంతంగా వైద్య ఖర్చులు భరించలేని వారిని అమెరికాలోకి అనుమతించడం ద్వారా ఇక్కడి వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

వలసల్ని అడ్డుకోవడంలో భాగంగా ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18 వేల మంది శరణార్థులను దేశంలో నివాసం ఉండేందుకు అనుమతిస్తామని ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. మోడ్రన్ రెఫ్యూజీ ప్రోగ్రామ్ ప్రారంభమైన తరువాత ఓ సంవత్సరంలో అమెరికాలో వలసదారుల సంఖ్యను ఇంత తక్కువకు కుదించడం ఇదే తొలిసారి.