‘కేసులతో మా నోళ్ళు మూయలేరు’!

న్యూఢిల్లీ: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన 49 మందిపై కేసులు నమోదవ్వడంపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ సహా 180 మంది ప్రముఖులు స్పందించారు. ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాయడం దేశద్రోహం ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. ఈ మేరకు వారు ఓ లేఖను విడుదల చేశారు. మాబ్ లిన్చింగ్ పై ఆందోళన వ్యక్తం చేసినందుకు 49 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా ? అని మండిపడ్డారు. పౌరుల నోళ్లు మూయించడానికి కోర్టులను కూడా దుర్వినియోగం చేస్తున్నారని, వేధింపులతో ప్రజల నోళ్లు మూయలేరు లేఖలో పేర్కొన్నారు.

రచయితలు అశోక్ వాజ్ పేయి, జెర్రీ పింటో, విద్యావేత్త ఇరా భాస్కర్, జీత్ థాయిల్, టిఎం కృష్ణ, సభా దేవాన్ తదితరులు ఈ కొత్త లేఖలో సంతకాలు చేశారు. ఈ అంశంపై తాము మాట్లాడటం కొనసాగిస్తామని లేఖలో స్పష్టం చేశారు. ‘భారతీయ సాంస్కృతిక సమాజంలో సభ్యులుగా, మనస్సాక్షి గల పౌరులుగా మేమందరం ఇలాంటి వేధింపులను ఖండిస్తున్నాము. మా మిత్రులు ప్రధానికి లేఖ రాయడాన్ని మేము సమర్ధిస్తున్నాం. మూకదాడులకు వ్యతిరేకంగా ప్రజల గొంతును నొక్కడానికి కోర్టుల ద్వారా వేధిస్తున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు.

దేశంలో మూక దాడులు పెరిగిపోతున్నాయంటూ ఈ ఏడాది జూలైలో వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు. లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బిహార్‌లోని ముజఫర్ పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. సినీ దర్శకులు శ్యామ్‌ బెనగల్‌, అపర్ణాసేన్‌, మణిరత్నం, ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, అనురాగ్‌ కశ్యప్‌, గాయకురాలు శుభ ముద్గల్‌, చరిత్రకారుడు రామచంద్ర గుహ, నటులు రేవతి, కొంకణాసేన్‌, తదితరులు లేఖ రాసిన వారిలో ఉన్నారు. ఈ లేఖలో సంతకాలు చేసినవారిపై సుధీర్ కుమార్ ఓజా అనే ఓ న్యాయవాది ముజఫర్ పూర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని పదవి విలువ తగ్గించేలా ప్రవర్తించారంటూ వీరిపై కేసు నమోదు చేయాలని పిటిషన్ లో కోరారు. దీనిపై విచారించన కోర్టు వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో అక్టోబర్ 3న 49 మంది ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలను కించపరిచారనే ఆరోపణలపై కూడా వారిపై కేసులు నమోదయ్యాయి.