జగన్‌కు సిబిఐ కోర్టు షాక్: వ్యక్తిగత హాజరు తప్పదు

అమరావతి: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సిఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టు కొట్టివేసింది.

జగన్ పిటిషన్‌పై సిబిఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు ముగిశాయి. ప్రతి శుక్రవారం విచారణకు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలని జగన్ అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎపి రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నందున  వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన  పిటిషన్‌లో కోరారు. తాను హాజరవ్వాల్సివస్తే ఖజానాపై భారం పడుతుందని కూడా జగన్ కోర్టుకు తెలిపారు. అయితే జగన్ అభ్యర్థనకు సిబిఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందనీ, ఇప్పుడు జగన్​కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందనీ వాదించింది.

ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని సిబిఐ పేర్కొన్నది. చట్టం ముందు అందరూ సమానులేననీ, సిఎం అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని సిబిఐ బలంగా వాదనలు వినిపించింది. గతంలో ఇదే అభ్యర్థనతో జగన్ దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని సిబిఐ గుర్తు చేసింది.

గత నెల 18న కోర్టులో వాదనలు ముగియగా తాజాగా శుక్రవారం సిబిఐ కోర్టు జగన్ పిటిషన్‌పై తీర్పు వెలువరించింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ సిబిఐ కోర్టు విచారణకు హజరయ్యారు.