కుష్వాహా రాజీనామా

నరేంద్ర మోదీని సమైక్యంగా ఢీకొనేందుకు ప్రతిపక్షాలు డిల్లీలో సమావేశమవుతున్న వేళ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షం నుంచే ప్రధానికి గట్టి దెబ్బ తగిలింది. బీహార్‌లో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ అధినాయకుడు ఉపేంద్ర కుష్వాహా కేంద్ర ప్రభుత్వం నుంచీ, ఎన్‌డిఎ నుంచీ వైదొలగారు. కుష్వాహా కేంద్ర మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

ప్రధాని మోదీ తమను వంచించారని కుష్వాహా ఆరోపించారు. మంత్రిమండలి పాలనను ధ్వంసం చేశారనీ, దానిని రబ్బర్ స్టాంప్‌గా మార్చేశారనీ ప్రధానికి రాసిన రాజీనామా లేఖలో ఆయన ఆరోపించారు. “మీరు, బిజెపి అధ్యక్షుడు మాత్రమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటున్నారు. మంత్రులు నామమాత్రంగా మిగిలి పోయారు” అని ఆయన పేర్కొన్నారు. ప్రజలూ, అణగారిన వర్గాల కోసం పని చేయడం కాకుండా రాజకీయ ప్రత్యర్ధులను శాయశక్తులా ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

కుష్వాహా ఎన్‌డిఎ వ్యతిరేక ఫ్రంట్‌లో చేరే అవకాశం ఉంది. రాజీనామాకు ముందు ఆయన ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఎన్‌డిఎ పెద్దన్న అయిన బిజెపి పట్ల కుష్వాహా కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బీహార్‌లో ప్రధాన పాలకపక్షం అయిన జనతాదళ్ (యు)తో రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి సీట్ల సర్దుబాటు ఈ అసంతృప్తికి కారణం. తన పార్టీకి రెండు మించి లోకసభ సీట్లు దొరకవని అర్ధం కాగానే కుష్వాహా గొంతు పెంచారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్‌ను ఆయన తీవ్రంగా విమర్శించారు.