తవ్వకాల్లో బయటపడ్డ టన్నెల్
పుణె మెట్రో పనులకు తవ్వకాలు
పుణె: దాదాపు వంద సంవత్సరాల క్రితం తవ్వినట్లుగా భావిస్తున్న సొరంగం ఒకటి పుణె నగరంలో బయటపడింది. పుణె మెట్రోరైలు కోసం తవ్వకాలు జరుపుతుంగా ఇది బయటపడిందని అధికారులు తెలిపారు. ఒకప్పుడు దీన్ని నీళ్ల సరఫరాకు వాడి ఉంటారని అంటున్నారు. స్వర్ గేట్ ప్రాంతానికి చెందిన ఈ 57 మీటర్ల సొరంగం సుమారు 90 ఏళ్ల క్రితం నాటిదని స్థానిక చరిత్రకారుడు మందర్ లావాటే చెప్పారు. అది బ్రిటిష్ కాలం నాటిది అయి ఉంటుందని, నీటి సరఫరా కోసం వాడారేమోనని అన్నారు.
స్వర్ గేట్ ప్రాంతంలో ఒక నీటి వనరు ఉందని, ఆ ప్రాంతం మీదుగా కాలువ కూడా పోతుందన లావాటే తెలిపారు. ముందుగా ఈ సొరంగం నుంచి నీటిని పంపి, తర్వాత స్వర్ గేట్ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి పంపింగ్ చేసేవారేమోనని అన్నారు. భూమి ఉపరితలానికి 12-15 అడుగుల లోతున ఉన్న ఈ సొరంగం వెడల్పు 1.4 మీటర్లు, ఎత్తు 3.5 మీటర్లు ఉంది. మెట్రో పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ సొరంగం బయటపడిందని మెట్రో ప్రాజెక్టులో పనిచేస్తున్న ఒక ఇంజనీరు తెలిపారు. సొరంగం రెండువైపులా మూసేసి ఉందని, కాలువకు 1200 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైపు అనుసంధానం అయి ఉందని అన్నారు.