‘అసత్యాలతో మభ్యపెట్టలేరు’

విజయవాడ: ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి అసత్యాలతో ప్రజలను మోసం చేయలేరని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో చంద్రబాబు 12 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇసుక లేక భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇసుక సమస్య ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇసుక కొరత సృష్టించి సిమెంట్ కంపెనీలతో సిఎం బేరసారాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని అన్నారు. ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని మండిపడ్డారు. ఏపి ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో దొరుకుతుంటే ఇంటి దొంగలు ముఖ్యమంత్రికి కనబడటం లేదా అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ సమస్య సృష్టించారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కాలం చెల్లి చనిపోయారని మంత్రులు అనగలరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల ఎవరూ నష్టపోలేదని అన్నారు. సొంత పొలంలో మట్టి ఇంటికి తీసుకుపోవాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలనడం అహంభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఇసుక సమస్యపై జనసేన నాయకుడు లాంగ్ మార్చ్ నిర్వహిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు. విమర్శలు చేసిన వారిపై తాము కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా అని చంద్రబాబు సవాల్ విసిరారు. విమర్శలు చేయడం మానుకొని ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు పదివేల రూపాయల వంతున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చంద్రబాబు కోరారు. టిడిపి ఎంపి, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా చంద్రబాబు దీక్షకు బిజెపి, జనసేనతో పాటు వామపక్షాలు సంఘీభావం తెలిపాయి.