ఈవీఎంల పోరుపై దేశ వ్యాప్త ఉద్యమం

38 views

అమరావతి, డిసెంబరు 19 ఈవీఎంలపై పోరును దేశ వ్యాప్తంగా తీసుకువెళ్ళేందు కు తెలుగుదేశంపార్టీ అధినేత, ఎపీ సీఎం నారాచచంద్రబాబునాయుడు వ్యూహరచన చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంల పనితీరుపై అనేక సందేహాలు తలెత్తిన నేపధ్యంలో జాతీయ స్థాయిలో ఈవీఎంలు పనితీరుపై బిజెపి వ్యతిరేక పార్టీలను చంద్రబాబు ఏకం చేసి ఉద్యమం చేపట్టే దిశగా అడుగులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు ఒకే పార్టీకీ అధికంగా రావడంపై రాజకీయ పార్టీల్లో సందేహాలు తలెత్తాయి. దీంతో ఈవీఎం లను పూర్తిగా రద్దుచేసి తిరిగి పాత బ్యాలెట్ పద్ధతిని పునరుర్ధరించాలని తెలుగుదేశం మళ్ళీ డిమాండ్ చేస్తోంది.గతంలోనూ ఎన్నికలో్ల ఈవీఎంల పనితీరుపైన చంద్రబాబునాయుడు అనేకమార్లు సందేహాలను వ్యక్తం చేశారు. ఈ తరుణంలో బిజెపి మినహా మిగిలిన జాతీయ పార్టీలను ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒకే తాటిపైకి తీసుకువచ్చి జాతీయ స్ధాయిలో పోరాటం చేయాలని టీడీపీ సిద్ధమవుతోంది. ఈవీఎంలు దుర్వినియోగం జరుగుతోందని గతంలోనూ పలుమార్లు జాతీయ స్థాయిలో ఉద్యమించిన ఎపి సీఎం చంద్రబాబునాయుడు మరోమారు తీవ్రస్ధాయిలో ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. గతంలోవలె బ్యాలెట్‌ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావనే అంశంపై వివిధ పార్టీలతో కలిసి పోరాడేందుకు కార్యాచరణకు సమాయత్తం అవుతున్నారు.

ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవీఎంల టాంపరింగ్‌కు అవకాశం ఉందని, అసలు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీలకు చెందిన ప్రతినిధులు రాజకీయపార్టీలకు వద్దకు వచ్చి అడిగినంత మేర డబ్బులు ఇస్తే ఈవీఎంలను అనుకూలంగా మారుస్తామంటూ ఆఫర్లను ఇస్తున్నారని చంద్రబాబు విలేకర్ల సమావేశంలో ఈవీఎంల అంశంపై పలు ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తారు. . అందుకే అవి నమ్మకమైనవి కావన్నది చంద్రబాబు వాదన. ఇదే విషయాన్ని గతంలోనూ చాలాసార్లు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మళ్లీ పాతపద్ధతిలోనే ఓటింగ్‌ నిర్వహించేలా ఇప్పటి నుంచే పోరాడాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కలుపుకొని వెళ్లేలా కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ఈవీఎంలలో రెండు మూడు నెలల్లోనే రికార్డు మొత్తం చెరిగిపోతుందన్న విషయాన్ని కూడా జాతీయస్థాయికి తీసుకెళ్తున్నారు. తన పోరాటానికి సన్నాహాకంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలపై వచ్చినలు ఫిర్యాదులు ఏవిధంగా ఉన్నాయి, అసలు పోల్ అయిన ఓట్లు ఎన్ని, ఓటరు జాబితాలో లేకుండా ఈవిఎంలో ఓటు ఎలా నమోదు అయ్యింది అన్న వివాదాస్పద అంశాలపైన టీఢీపీ తీవ్రంగా కసరతు్త చేస్తోంది. అసలు ఈవీఎంల పనితీరుపైన తెదేపా ఐటీ విభాగం పరిశీలిస్తోంది. అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతు అవడాన్నిఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించడం, అనేక మందికి గుర్తింపు కార్డులు లేకపోవడంపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నారు. ఈ ఓట్ల తొలగింపుపై కుట్ర ఉందని తెదేపా భావిస్తోంది. ప్రధానంగా జాతీయ ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని టీడీపీ ప్రధాన ఆరోపణగావుంది. ఈనేపధ్యంలో కాంగ్రెస్ పార్ఠీ అధినేత రాహుల్ గాంధీతో కూడా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించి జాతీయ ఉద్యమంగా చేపట్టాలని భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పాత పద్ధతిలో బ్యాలెట్ ప్యాపర్ అందుబాటులో తీసుకురావాలని ఏపి సీఎం చంద్రబాబునాయుడు జాతీయ స్ధాయిలో వత్తిడి తీసుకువస్తున్నారు. ఈ విషయంపైన బిజెపి వ్యతిరేక పార్టీలు కలసివచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి..