‘వారోత్సవాలు కాదు..ఇసుకాసురుల భరతం పట్టండి’

అమరావతి: ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడటం కోసం వారం రోజుల పాటు అధికారులు ఇసుక మీదే పని చేయాలనీ, దానికోసం ఇసుక వారోత్సవాలు నిర్వహించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొనడాన్ని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. బుధవారం దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వారోత్సవాల నిర్వహణ సిగ్గుచేటని అన్నారు.

ఇసుక వారోత్సవాలు కాదు..ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలు జరపాలని చంద్రబాబు అన్నారు. గ్రామానికో వైసిపి ఇసుకాసురుడు తయారయ్యారని చంద్రబాబు విమర్శించారు. ఇసుకాసురుల భరతం పడితేనే పేదలకు నిజమైన దీపావళి అని చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక ఆరుగురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, ఇవన్నీ వైసిపి ప్రభుత్వ హత్యలేననీ చంద్రబాబు ఆరోపించారు.

ఆత్మహత్యలపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని తన పార్టీ నేతలకు సూచించారు. దీనిపై ఢిల్లీలో జాతీయ స్థాయిలో వైసిపి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చంద్రబాబు అన్నారు.

తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపిలోనే ఎందుకొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక నియంత్రణ పేరుతో వైసిపి నేతలు జేబులు నింపుకొంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు పది వేల రూపాయల వంతున పరిహారం ఇవ్వడంతో పాటు కార్మిక సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు సూచించారు.