“చిదంబరం ఆరోగ్యం శుభ్రంగా ఉంది, ఆస్పత్రికి ఎందుకు?”

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. తన ఆరోగ్యం బాగాలేదంటూ చిదంబరం పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ మెడికల్ బోర్టు హైకోర్టులో నివేదిక సమర్పించింది. చిదంబరం ఆరోగ్యంగానే ఉన్నారని, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని మెడికల్ బోర్టు తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. వాదనల అనంతరం.. చిదరంబరం ఉండే గది శుభ్రంగా ఉండేలా చూడాలని తీహార్ జైలు సూపరింటెండెంట్ కు జస్టిస్ సురేశ్ కైత్ ఆదేశించారు. అలాగే ఆయనకు ఇంటి భోజనం, మినరల్ వాటర్, దోమ తెరను అందించాలని సూచించారు. చిదంబరానికి ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్ లు చేయించాలని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలపై చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ సంతృప్తి వ్యక్తం చేయడంతో మధ్యంతర బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైలు ఉన్న చిదంబరం.. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు ఒక వైద్య  బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ  బృందం శుక్రవారం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఆయన ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని నివేదిక సమర్పించడంతో.. ఆయన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ లభించేలా లేదు. సీబీఐ, ఈడీ ఒకరి వెనక ఒకరు రిమాండ్‌కు తీసుకోవడంతో ఆయన జైలుకు పరిమితమయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా తాను హైదరాబాద్ కు వెళ్తానని చిదంబరం పిటిషన్ వేశారు. కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ముందు ఇంద్రాణి ఇచ్చిన వాంగ్మూల‌మే చిదంబ‌రం అరెస్టుకు దారి తీసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) ద్వారా నిధుల్ని మళ్లించేందుకు బదులుగా తన కుమారుడు కార్తీ చిదంబరానికి సహాయం చేయాలని చిదంబరం తనను, తన భర్త పీటర్‌ ముఖర్జియాను కోరినట్టు ఇంద్రాణీ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కాంలో ఇంద్రాణీ, ఆమె రెండో భర్త పీటర్‌ ముఖర్జీ సహ నిందితులు. ఆ మీడియా సంస్థ స్థాపకులు కూడా వీరే. చిదంబరం కుమారుడు కార్తి, పీటర్ కు వ్యాపార సలహాదారుడు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండడం, కార్తి తమకు సలహాదారుడు కావడంతో ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంద్రాణీ చక్రం తిప్పింది. ఐఎన్‌ఎక్స్‌లో 26 శాతం వాటా అమ్మకానికి అనుమతి కోరుతూ ఎఫ్‌ఐపీబీకి దరఖాస్తు చేసింది. కానీ ఆమె దరఖాస్తును ఎఫ్‌ఐపీబీ తిరస్కరించింది. చిదంబరం కూడా రూ 4.62 కోట్లరూపాయల వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు. ఈ సమయంలో కార్తితో ఇంద్రాణీ వ్యవహారం నడిపించేందుకు స్కెచ్ వేసింది. దీంతో కార్తి ఆమెతో బేరానికి దిగాడు. ‘విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఆమె డీల్‌ ఓకే చేయిస్తాననడంతో ఇంద్రాణీ, పీటర్‌ ఒప్పుకున్నారు. దీంతో  మనీ లాండరింగ్‌ ద్వారా దాదాపు రూ. 300 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. తర్వాత కార్తిని, ఇంద్రాణీ ఓ స్టార్‌ హోటల్లో కలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 10 లక్షల డాలర్ల చెల్లింపులకు చర్చలు జరగ్గా రూ 3.5 కోట్ల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో అరెస్టయ్యాక ఇంద్రాణీ అప్రూవర్‌గా మారి ఈ వివరాలన్నింటినీ బయట పెట్టేయడంతో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.