భారత్, పాక్ సంయమనం పాటించాలి: చైనా

పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత్‌ చేసిన మెరుపు దాడిపై చైనా స్పందించింది. భారత్, పాక్ లు సంయమనం పాటించాలని చైనా కోరింది.

జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌ను తోసిపుచ్చిన చైనా తాజాగా మెరుపు దాడులపైనా తనదైన శైలిలో స్పందించింది.

‘భారత్, పాకిస్థాన్ లు సంయమనం పాటిస్తాయని ఆశిస్తున్నాం. అది ఈ ప్రాంతంలో పరిస్థితిని తిరిగి గాడిన పెడుతుంది. తద్వారా పరస్పర సంబంధాలు మెరుగవుతాయని’ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్ పేర్కొన్నారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్‌-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పాక్‌ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్‌ రూమ్‌లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.