చిరు ‘ఇంద్ర’ స్టెప్.. జగన్ ‘వీణ’ గిఫ్ట్!

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లిన చిరు దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు జగన్ దంపతులు. సీఎం జగన్, భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. చిరంజీవి, జగన్ ఇంటికి చేరుకోగానే సీఎంకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు. గంట పాటు చిరంజీవి, జగన్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని వీక్షించాలని సీఎం జగన్‌ను చిరంజీవి కోరారు. లంచ్ చేసే సమయంలో సైరా సినిమా గురించి చిరు వివరించినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు చిరంజీవి జగన్‌ను వినోదపు పన్ను మినహాయింపు గురించి కూడా కోరినట్లు తెలుస్తోంది. సైరా సినిమా చూసేందుకు జగన్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ సైరా సినిమాను చూసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ సీఎం అయ్యాక టాలీవుడ్‌కి చెందిన చిన్న నటులే తప్ప.. అగ్ర నటులు కానీ, ఇతర సినీ ప్రముఖులు కానీ ఆయనను కలవలేదు. తొలిసారిగా అగ్రహీరోల్లో ఒకరైన చిరంజీవి కలుస్తుండడంతో సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో వీరి భేటీపై ఆసక్తి ఏర్పడింది. ఇది ఇలా ఉంటే.. జగన్ ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్ నటీనటులకు ఇష్టం లేదని, అందుకే ఆయనను ఎవరూ కలవలేదని ఇటీవల కాలంలో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. కొందరు ప్రముఖులకు జగన్ అంటే ఇష్టం లేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.