చిరుతో జగన్ లంచ్ మీటింగ్!

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో నటుడు చిరంజీవి భేటీ కానున్నారు. సీఎం జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా హైదరాబాదు నుంచి విజయవాడ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయం వద్ద చిరంజీవికి మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. పూలమాలను వేసి, ‘జై చిరంజీవ’ అంటూ నినాదాలు చేశారు. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం నివాసానికి చిరంజీవి దంపతులు చేరుకుంటారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో కలసి విందును ఆరగిస్తారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని వీక్షించాలని సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నారు.

మరోవైపు జగన్, చిరంజీవి భేటీపై రాజకీయ వర్గాల్లో కూడా భారీ చర్చ జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక టాలీవుడ్ కి చెందిన చిన్న నటులే తప్పా.. అగ్ర నటులు కానీ, ఇతర సినీ ప్రముఖులు కానీ ఆయనను కలవలేదు. తొలిసారిగా అగ్రహీరోల్లో ఒకరైన చిరంజీవి కలవనుండటంతో సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ కలయిక వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనని చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు.

ఇదిఇలా ఉంటే.. జగన్ ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్ నటీనటులకు ఇష్టం లేదని, అందుకే ఆయన్ను ఎవరూ కలవలేదని ఇటీవల కాలంలో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. కొందరు ప్రముఖులకు జగన్ అంటే ఇష్టం లేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి లంచ్ మీటింగ్ ఆసక్తికరంగా మారింది.