‘ఆ చట్టాల బ్రేక్‌కు రెండు మార్గాలు’

న్యూఢిల్లీ: సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న సందర్భంలో జనతాదళ్ యునైటెడ్ నేత ప్రశాంత్ కిషోర్ ఈ చట్టాల అమలు ఆపడానికి రెండు మార్గాలను సూచించారు.

పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్ఆర్‌సికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో కాంగ్రెస్‌కు చెందిన సిఎంలు పాల్గొనడం లేదని ఆయన మండిపడ్డారు. తాజాగా సిఎఎ, ఎన్ఆర్‌సిలపై ఏఐసిసి నేత సోనియా గాంధీ స్పందించారు. బిజెపి నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీ వీడియోను రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ సిఎంలు స్పందించాలన్నారు. లేకపోతే సోనియా గాంధీ విమర్శలకు అర్థం ఉండదని అన్నారు.

సిఎఎ, ఎన్ఆర్‌సి అమలును ఆపడానికి రెండు మార్గాలు ఉంటూ…1. అన్ని వేదికలపై మీ గొంతును పెంచడం ద్వారా శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించారు. 2. బిజెపియేతర రాష్ట్రాలలో 16మంది సిఎంలు అందరూ తమ రాష్ట్రాల్లో ఎన్ఆర్‌సికి నో చెప్పాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు.

పౌరసత్వ సవరణ బిల్లుకు జనతాదళ్ యునైటెడ్ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మద్దతు తెలియజేయగా ప్రశాంత్ కిషోర్ మాత్రం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన సిఎం నితీష్ కుమార్ ఎన్ఆర్‌సికి మాత్రం మద్దతు తెలుపలేదు. తమ రాష్ట్రంలో ఎన్ఆర్‌సి అమలు చేయబోమని స్పష్టం చేశారు.