మండలి రద్దుకే జగన్ మొగ్గు?!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఏపీ శాసన మండలి రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభను రద్దు చేసేందుకే సీఎం వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారు. రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. మండలి రద్దు దిశగా అసెంబ్లీలో మాట్లాడారు. బుధవారం మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై గురువారం ఏపీ అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించారు. దీనిపై మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన మండలిని రద్దుచేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మండలిలో విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకపోవగా.. ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతోదని విమర్శలు గుప్పించారు. అలాంటి మండలి అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి, శాసన మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వలేనీ సభ అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపాదిస్తున్నానని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. సలహాలు, సూచనలు చేసేందుకు పెద్దల సభ ఉందన్నారు. మంత్రుల సూచనలను చైర్మన్‌ షరీఫ్ పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రజలకు మేలు చేసే విషయంలో ప్రభుత్వానికి సలహలు సూచనలు ఇవ్వాల్సిన మండలి.. చట్టాలకు నిరోధంగా మారిందని సీఎం జగన్ అన్నారు. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలను జగన్ తీవ్రంగా ఖండించారు. చట్టం, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ మండలి మనకు అవసరమా? అని అసెంబ్లీలో అభిప్రాయపడ్డారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని.. రోజుకు కోటి రూపాయలు ఖర్చయ్యే మండలి మనలాంటి పేద రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. దీనిపై అందరం తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ‘మండలి’ అన్నది చట్టసభలో భాగం కనుక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని, తన నమ్మకంతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నిన్న శాసనమండలిలో జరిగిన తంతును అందరూ గమనించారని పేర్కొన్నారు.

గురువారం అసెంబ్లీలో సీఎం, మంత్రుల ప్రసంగాలు చూస్తుంటే.. మండలి రద్దుకు వడివడిగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వరకూ అసెంబ్లీ సమావేశాలను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. గణతంత్ర దినోత్సవం ఏర్పాట్ల నేపధ్యంలో శుక్రవారం(జనవరి 24) నుంచి మూడు రోజులు విరామం ఇచ్చారు. తిరిగి సోమవారం(జనవరి 27) సభ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం మండలి రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రభుత్వ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చర్చ అనంతరం మండలి రద్దుపై ఓటింగ్ నిర్వహించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి శాసన సభలో భారీ మెజారిటీ.. మండలిలో మాత్రం తక్కువ మెజారిటీ. దీని కారణంగా సీఎం జగన్ పలు బిల్లులను ఆమోదించుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న ఇంగ్లిష్ మీడియం బిల్లును తిప్పి పంపిన మండలి.. బుధవారం(జనవరి 22) పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు లాంటి రెండు కీలక బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపింది. మండలిలో బిల్లులు ప్రవేశపెట్టడానికే రూల్ 71 కింద అవరోధం కల్పించి వైసిపికి చెమటలు పట్టించిన టిడిపి తన పంతం నెగ్గించుకున్నది. మండలిలో టీడీపీ బలంగా ఉండటమే దానికి ప్రధాన కారణం.

అయితే, ఈ పరిస్థితి సీఎం జగన్‌కే కాదు గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌కు కూడా ఎదురైంది. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉండేది. కానీ, మండలికి వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్‌దే హవా కొనసాగింది. టీడీపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు అడ్డు తగులుతూ వచ్చింది. ఎన్టీఆర్‌కు మండలిలో రోశయ్య ముప్పు తిప్పలు పెట్టారని అంటుంటారు. దీంతో, 1985లో ఆయన మండలిని రద్దు చేశారు. అప్పటి నుండి మళ్లీ తిరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో సీఎం అయ్యేంత వరకు మండలి ఏర్పాటు కాలేదు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి కొలువుదీరింది. ఎన్టీఆర్‌కు వచ్చిన సమస్యే ఇప్పుడు జగన్‌కు ఎదురవుతోంది. అయితే, తన తండ్రి వైఎస్‌ఆర్ తిరిగి తీసుకొచ్చిన అదే మండలి ఇప్పుడు కుమారుడి, ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ని ఇబ్బంది పెట్టడం గమనార్హం. ఈ క్రమంలో శాసన మండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోంది. ఈ విషయమై సోమవారం అసెంబ్లీ సమావేశంలో జరిగే చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.