వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం కడప రిమ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ మాట చెప్పారు. వైసిపి ఎన్నార్సీకి మద్దతు ఇవ్వదని తెలిపారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం అంజద్ బాషా వ్యాఖ్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. మైనార్టీలకు అండగా నిలబడతామని జగన్ హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలపై నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు సైతం కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. ఇటు తమిళనాడు, కర్నాటకలో సైతం ప్రజలు పెద్త ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎన్ఆర్సీకి వ్యతిరేకమన్నారు. పార్లమెంట్‌లో పౌరసత్వం సవరణ బిల్లుకు ఆయన మద్దతు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు సీఏఏకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్సీపై ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం ఎన్నాఆర్సీకి పూర్తిగా వ్యతిరేకమన్నారు.

సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకించాలని ఇటీవలే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ కోరిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని, బీజేపీతో జగన్ సంబంధం వధులుకోవాలని ఓవైసీ కోరారు.