రైతు భరోసాకు శ్రీకారం

నెల్లూరు: రైతులకు పెట్టుబడి సాయంగా అందించే వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తాను నిర్వహించిన పాదయాత్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నానని జగన్ అన్నారు. రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు మేనిఫెస్టోలో మొట్టమొదటి వాగ్దానంగా రైతుభరోసా పథకాన్ని ప్రకటించినట్లు జగన్ చెప్పారు. ఎనిమిది నెలల ముందుగానే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చామని జగన్ అన్నారు. ఈ పథకం ద్వారా 54 లక్షల మందికి సాయం అందుతుందని జగన్ పేర్కొన్నారు. ఏడాదికి ప్రకటించిన 12,500 రూపాయలకు మరో వెయ్యి రూపాయలు పెంచడం జరిగిందని జగన్ తెలిపారు. పథకం ప్రారంభం సందర్భంగా లబ్దిదారులకు సిఎం చెక్కులను పంపిణీ చేశారు. ఈ రోజు నుండే రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నగదు జమ అవుతుందని జగన్ అన్నారు.