ఆర్టీసీ సమ్మె సెగ.. కేసీఆర్ సభ రద్దు!

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఉపఎన్నిక ప్రచారానికి మరో మూడ్రోజులు మాత్రమే ఉండటంతో హుజూర్ నగర్ లో సభ నిర్వహించాలని కేసీఆర్ భావించారు. అందుకు తగ్గట్లే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి.. హుజూర్‌నగర్ ఉపఎన్నిక ముందు సత్తా చాటాలని టీఆర్ఎస్ భావించింది. ఈ సభలో సీఎం ఆర్టీసీ సమ్మెపై వ్యాఖ్యానిస్తారని, ఏదో ఒక ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ గులాబీ నేతల ఆశలపై వర్షం నీరు చల్లింది. సభ ప్రారంభానికి ముందే భారీ వర్షం పడింది. గంటకుపైగా కుండపోత వర్షం కురవడంతో.. సభా ప్రాంగణం మొత్తం అస్తవ్యస్తమైంది. దీంతో వేదిక చిందరవందరగా మారింది. సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు తడిసిముద్దయ్యారు. దీంతో సభ రద్దు అవుతున్నట్టు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే.. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలోనే కేసీఆర్ ఈ సభకు హాజరు కాలేదని చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎన్నికల ఖర్చుపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టడం.. ఆర్టీసీ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలే అవకాశం ఉండటంతో కేసీఆర్ హుజూర్ నగర్‌లో అడుగుపెట్టలేదనే వాదన వినిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ సభకు హాజరై నిరసన తెలిపే అవకాశం ఉందని సీఎంకు ముందుగానే సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని ఆది నుంచి చెబుతూ వస్తున్న కేసీఆర్.. కార్మికుల ఆత్మహత్యల తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారినా.. అదే వైఖరిని కొనసాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళన ఉధృతం చేశారు. ఇలాంటి సమయంలో హుజూర్ నగర్ సభకు ఆర్టీసీ కార్మికులు కూడా హాజరై.. నిరసన తెలిపితే.. పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ హుజూర్‌నగర్‌లో ప్రచారానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి ఎవరికీ అంతుచిక్కడం లేదు.