‘సీఏఏకు తెలంగాణ వ్యతిరేకం’

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఏఏపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు. కులాలు, మత విశ్వాసాలకు అతీతంగా… భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు ఇస్తోందన్నారు. ముస్లింలను ఎలా పక్కన పెడతారని అయన ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించామని గుర్తు చేశారు. ఒక లౌకిక వాద పార్టీగా వందకు వంద శాతం తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దును తాము సమర్థించామని, అయితే అది దేశానికి సంబంధించిన విషయమని కేసీఆర్ చెప్పారు.

‘‘దేశంపై మతతత్వ ముద్రపడుతుంటే మనం మౌనంగా ఉంటే విదేశాల్లో మన ప్రతిష్ట దెబ్బతింటుంది. విదేశాల్లో ఉండే మన పిల్లల భవిష్యత్‌కు అది క్షేమం కాదు. పౌరసత్వ సవరణ బిల్లు వంద శాతం తప్పుడు బిల్లు. సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాలి. సీఏఏను వ్యతిరేకిస్తూ అవసరమైతే పది లక్షల మందితో సభ నిర్వహిస్తాం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సీఏఏకు వ్యతిరేకంగా త్వరలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు సీఏఏని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాయని, త్వరలో తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. బీజేపీకి మత రాజకీయాలు తప్ప… వేరే తెలియదని సీఎం కేసీఆర్ విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశ ప్రతిష్ఠ అప్రతిష్ఠ పాలైందన్నారు. ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే ఇలాంటి నిర్ణయాలు ఎందుకని ప్రశ్నించారు. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ గురించి పట్టించుకోకుండా ప్రజలను రెచ్చగొట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. హిందూ, ముస్లింలు కలిసి ఉన్నారని చెప్పారు. మన దేశం వాళ్లు గల్ఫ్ లో ఉంటున్నారని, వాళ్లను ఆయా దేశాలు వెళ్లిపోమంటే మన పరిస్థితి ఏంటి ? అని కేసీఆర్ ప్రశ్నించారు. మతతత్వ పార్టీ వైఖరి వల్లే భైంసాలో అల్లర్లు జరిగాయని తెలిపారు. భైంసాలో జరిగిన ఘటనకు తాను కూడా సహించలేదన్నారు. భైంసాకు బలగాలను పంపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. పోలీసులు తీసుకున్న చర్యల వల్ల భైంసాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ఇలాంటి విధానాల వల్లే బీజేపీ ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్నాయని, ఢిల్లీలో కేజ్రీవాల్‌ గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ తెలిపారు.