ఫొటో షూట్‌ తెచ్చిన తంటా.. చిక్కుల్లో యడ్డీ!

బెంగళూరు: కర్నాటక సీఎం యడియూరప్ప కొత్త చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన నివాసంలో జరిగిన ఫొటో షూట్ విమర్శలకు దారి తీసింది. ఓ వైపు రాష్ట్ర ప్రజలు వరదల్లో చిక్కుకుంటే పాలన గాలికి వదిలేసి ఫొటో షూట్ కోసం ఆరాటపడుతున్నారంటూ విపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో ఓ ఫొటో షూట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మేకప్ వేసుకుంటూ చుట్టూ కెమెరా మెన్లు సిద్ధంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయనపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోకుండా కేవలం ప్రచార కార్యక్రమాలకు అవసరమైన ఫొటో షూట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మరణించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం చేసిన పని విమర్శలకు దారి తీసింది.