వారెవ్వా.. సర్వే యాక్టింగ్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతమవుతోంది. కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సోమవారం రోజున ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని ముందుగానే గృహ నిర్భందం చేశారు. అయితే, కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అపహాస్యం చేసేలా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వ్యవహరించారు.

కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సర్వే సత్యనారాయణను పోలీసులు ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. అయితే అదంతా నటన అని తరువాత వెల్లడైంది. ఒక్కసారిగా సర్వేను ముట్టడించిన పోలీసులు… ఏదో సినిమా షూటింగ్‌లోలా షాట్ ఓకే అని చెప్పగానే ఆయనను వదిలేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్వే తీరుపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను పోరాటాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని మండిపడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా.. హీరోయిజంతో రేవంత్ రెడ్డి లాంటి నేత ప్రగతిభవన్‌ గేటును టచ్‌చేసి చూపిస్తే, ఇలా నకిలీ హంగామాతో సర్వే కూడా వార్తల్లో నిలిచారు.